Mallikarjuna Kharge Tour: తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతున్న ఖర్గే టూర్ ! రేపు కీలక సమావేశాలు, ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ!
Mallikarjuna Kharge Tour: అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తెలంగాణకు వస్తున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్న ఖర్గే, రేపు మీటింగ్స్‌లో పాల్గొంటారు.

AICC Chief Mallikarjuna Kharge Telangana Tour: అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈరోజు(3జూన్ 2025) సాయంత్రం తెలంగాణకు రానున్నారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోనున్న ఖర్గే, రేపు(శుక్రవారం) కూడా ఇక్కడే ఉండనున్నారు. పార్టీ అంతర్గత సమావేశాలతో పాటు, ఎల్బీ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. రేపటి ఆయన షెడ్యూల్ ఏంటో తెలుసుకుందాం.
రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొననున్న ఖర్గే
గాంధీ భవన్లో రేపు ఖర్గే బిజీ బిజీగా గడపనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా మల్లికార్జున్ ఖర్గే ఉదయం గాంధీ భవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్ నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ నుంచి ఏఐసీసీలో ప్రాతినిధ్యంవహిస్తున్న కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, రేణుకా చౌదరి, జానారెడ్డి వంటి కొందరు సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ సమావేశంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై పూర్తి స్థాయిలో సమగ్ర విశ్లేషణ చేయనున్నారు. ప్రభుత్వ పాలనాతీరును, ప్రజా స్పందనను సమీక్షించనున్నారు. పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారంపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీకి ఎదురయ్యే సవాళ్లు, వాటిని ఎదుర్కొనే వ్యూహాలపై చర్చ జరగనుంది. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై ఖర్గే ఈ సమావేశంలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్న ఖర్గే
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తర్వాత ఖర్గే గాంధీ భవన్‌లోనే పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీఎం, పీసీసీ చీఫ్, సీనియర్ మంత్రులు సహా టీపీసీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. ఈ సమావేశంలో వారి నుంచి అభిప్రాయాలు, ఆలోచనలు, సూచనలు స్వీకరిస్తారు. పార్టీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సంసిద్ధం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. పార్టీలో ఐక్యతను, క్రమశిక్షణను పెంపొందించేలా అఖిల భారత అధ్యక్షుడు ఖర్గే పలు సూచనలు చేసే అవకాశం ఉంది.
ఎల్బీ స్టేడియంలో జరిగే తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనంలో ఖర్గే
దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను పటిష్టం చేసే కార్యక్రమాల్లో భాగంగా, తొలిసారిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే క్షేత్ర స్థాయి నాయకత్వాన్ని నేరుగా కలిసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఏ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ నాయకత్వం ఇలాంటి సభ నిర్వహించలేదని చెబుతున్నారు. జిల్లా, బ్లాక్, గ్రామ అధ్యక్షులను ఈ సమావేశం ద్వారా ఖర్గే నేరుగా కలవనున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించడం, సంస్థాగత లోపాలను సరిదిద్దేలా మార్గనిర్దేశం చేయడం, గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే వ్యూహాలను ఇక్కడ చర్చించనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలను, కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా పార్టీ అధ్యక్షుడు సూచనలు ఇవ్వనున్నారు.
ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొననున్న ఖర్గే
పార్టీ సంస్థాగత వ్యవహారాలపై గాంధీ భవన్‌లో, పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనంలో పాల్గొననున్న ఖర్గే, ఈ పర్యటనలో ప్రజలతోనూ ముచ్చటించనున్నారు. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ ఎల్బీ స్టేడియంలో మధ్యాహ్నం నుంచి బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఇందు కోసం తెలంగాణ జిల్లాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల అమలు, వాటి ఫలితాలను ప్రజలకు వివరించనున్నారు. ఆరు గ్యారంటీ పథకాల అమలు తీరును, ప్రభుత్వ పాలన విజయాలను చెప్పే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ సభ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలు, యువత, కార్మికులు, రైతులను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. దీంతో పాటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీల విమర్శలను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తిప్పికొట్టే అవకాశం ఉంది.






















