Adluri Laxman Fires on Ponnam: తన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి.. వివేక్ సైతం ప్రశ్నించలేదు: అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన
Adluri Laxman demands apology from Ponnam Prabhakar | తోటి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Adluri Laxman vs Ponnam Prabhakar | హైదరాబాద్: ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు మంత్రుల మధ్య వివాదాన్ని రేపాయి. మీటింగ్ లో పాల్గొన్న సందర్భంగా పొన్నం ప్రభాకర్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా అని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అన్న మాటను సమర్ధించుకొని ఇప్పటివరకు స్పందించలేదంటే.. పొన్నం ప్రభాకర్ విజ్ఞతకే వదిలేస్తున్నా అని అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. నీ సహచర మంత్రిని దళితుడ్ని అంత మాట అంటే చూస్తూ ఉంటావా అని వివేక్ తీరుపై సైతం అడ్లూరి అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తనకు మద్దతు తెలిపిన వారికి, స్పందించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. మనకు సమయం విలువ, జీవితం గురించి తెలుసు.. కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుకు అంటూ మాట్లాడారు. ఆ సమయంలో మైక్‌లు ఆయన మాటలు బయటకు వినిపించాయి.
పొన్నం మా జాతిని అవమానించారు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన
మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలు, తానొక్కడిని కాదు.. మాదిగలు మొత్తాన్ని అవమానించడమే అన్నారు. ‘నేను మంత్రి కావడం, మా సామాజిక వర్గంలో పుట్టడం నా తప్పా?. ఇప్పటికైనా పొన్నం ప్రభాకర్ తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెబితే ఆయన గౌరవం పెరుగుతుంది. ఆయన లాగా అహంకారంగా మాట్లాడడం నాకు రాదు. కానీ మా జాతిని మొత్తం అవమానపరిచినంత పని చేశాడు. ఆయన చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహించక పోతే ఎలా’ అని ప్రశ్నించారు.

పొన్నం ప్రభాకర్‌పై విమర్శలు చేస్తూనే, మంత్రి వివేక్ వెంకట్ స్వామి తీరుపై సైతం అడ్లూరి లక్ష్మణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను పక్కన ఉంటే వివేక్ ఓర్చుకోవడం లేదన్నారు. తన పక్కన వివేక్ కూర్చోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహచర మంత్రిని, తోటి దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చొన్నారు. కనీసం ఈ విషయాన్ని ఖండించలేదని తెలిపారు.
పార్టీ హైకమాండ్ దృష్టికి విషయం
తాను త్వరలోనే ఈ విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లా అన్నారు అడ్లూరి లక్ష్మణ్. సాధ్యమైనంత త్వరలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్రం ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ లను కలుస్తానని తెలిపారు. తమ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని వివరించి న్యాయం కోరతానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.






















