Rangareddy Deputy Collector ACB: ఏసీబీ వలలో రంగారెడ్డి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ - వందల కోట్ల అక్రమ ఆస్తుల గుర్తింపు.. భూదందాల బాగోతం వెలుగులోకి!
Rangareddy Deputy Collector : రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్‌కు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏసీబీ దాడుల్లో వెదుకుతూంటే ఆస్తులు కట్టలు కట్టలుగా బయటపడుతున్నాయి.

Rangareddy Deputy Collector Corruption Case: తెలంగాణ రెవెన్యూ శాఖలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ కే. వంశీ మోహన్ నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 8 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వ భూములే లక్ష్యంగా అక్రమాలు
వంశీ మోహన్ గతంలో శేరిలింగంపల్లితో పాటు పలు కీలక ప్రాంతాల్లో ఆర్డీవో (RDO)గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే కాకుండా, భారీగా ఆస్తులు వెనకేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని పిగ్లీపురంలో సుమారు 8 ఎకరాల ఖరీదైన ప్రభుత్వ భూమిని కాజేసి, దాన్ని తన మామ పేరుపై రిజిస్ట్రేషన్ చేయించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. ఆ భూమిని తిరిగి ఒక రియల్టర్‌కు దారాదత్తం చేసి, అందులో భారీ లాభాలను ఆర్జించినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి.
రియల్టర్ల నుంచి గిఫ్ట్ డీడ్లు
భూముల మ్యుటేషన్లు, లేఅవుట్ల అనుమతుల విషయంలో రియల్టర్ల నుంచి వంశీ మోహన్ నగదు రూపంలోనే కాకుండా ప్లాట్ల రూపంలోనూ ముడుపులు అందుకున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి సుమారు 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తన బంధువుల పేర్లపై తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం వీటి విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుందని అంచనా. శేరిలింగంపల్లి వంటి హై-డిమాండ్ ఏరియాలో పని చేసిన కాలంలోనే ఈ అక్రమాలు ఎక్కువగా జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
వందల కోట్ల సామ్రాజ్యం
సోదాల్లో ఇప్పటివరకు గుర్తించిన డాక్యుమెంట్ల ప్రకారం.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫ్లాట్లు, విల్లాలు, భారీగా వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్లలో ఉంటుందని సమాచారం. వంశీ మోహన్ బంధువులు, బినామీల పేర్లపై ఉన్న ఆస్తులపై కూడా ఏసీబీ నజర్ పెట్టింది. బ్యాంక్ లాకర్లు తెరిస్తే మరిన్ని నగదు, బంగారు ఆభరణాలు బయటపడే అవకాశం ఉంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఇంతటి భారీ స్థాయిలో భూదందాలకు పాల్పడటం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది.
కఠిన చర్యల దిశగా..
ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించాల్సిన అధికారే భక్షకుడిగా మారడంపై ఏసీబీ తీవ్రంగా పరిగణిస్తోంది. సోదాలు ఇంకా కొనసాగుతుండటంతో, పూర్తి స్థాయి ఆస్తుల విలువను అధికారులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. ఈ భూదందాల్లో వంశీ మోహన్‌కు సహకరించిన ఇతర అధికారులు, రాజకీయ నాయకుల వివరాలను కూడా ఏసీబీ సేకరిస్తోంది. పక్కా సమాచారంతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.
ట్రెండింగ్ వార్తలు






















