ABVP: ఢిల్లీలో ఏబీవీపీ 69వ జాతీయ సభలు - పోస్టర్ విడుదల
ABVP National Congress: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 69వ జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం తార్నాకలోని రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
ABVP National Congress: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఏబీవీపీ 69వ జాతీయ మహాసభలకు (National Congress) సంబంధించిన పోస్టర్‌ను శనివారం తార్నాకలోని రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అమృత మహోత్సవ సంవత్సరంలో భాగంగా డిసెంబరు 7 నుంచి 10వ తేదీ వరకు 69వ జాతీయ మహాసభలు ఢిల్లీలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు మహాసభలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఏబీవీపీ జాతీయ మహాసభలకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులను ఒక దగ్గరకి చేర్చే థీమ్ తో ఈ కార్యక్రమం 4 రోజులు జరుగుతుందన్నారు. ఏబీవీపీ 75 వసంతాల సందర్భంగా ఈ సంవత్సరం అమృత్ మహోత్సవాలను నిర్వహించుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సంస్థాగత చరిత్ర, నాయకత్వం వహించిన ఉద్యమాలను గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తామన్నారు. ఈ మహా సభల్లో విద్యారంగంలో పరివర్తన, దేశవ్యాప్తంగా విద్యార్థి, యువతకు సంబంధించిన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రముఖ విద్యావేతలు పాల్గొని అనేక అంశాలపై చర్చిస్తారని పేర్కొన్నారు.
నూతన విద్యా విధానంపై చర్చ
నూతన జాతీయ విద్యా విధానం, ఏబీవీపీ భవిష్యత్ ప్రణాళిక, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలు మొదలైన అంశాలపై చర్చించనున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి వివరించారు. విద్యారంగ సమస్యలు, జాతీయ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి సమగ్రంగా చర్చించి తీర్మానాలను ఆమోదిస్తారని అన్నారు. అలాగే సేవ, పర్యావరణం, విద్యా రంగాల్లో అత్యుత్తమ సేవ చేసిన వారికి గుర్తింపుగా ప్రొ.యశ్వంత్ రావ్ కేల్కర్ యువ పురస్కారం అందిస్తామన్నారు. ఈ మహాసభలు ఢిల్లీలోని బురారిలో DDA గ్రౌండ్‌లో నిర్వహిస్తామని చెప్పారు. జాతీయ సభల కోసం ఇంద్ర ప్రస్థం నగరం పేరిట టెంట్ సిటీ నిర్మించినట్లు తెలిపారు. ఈ నగరంలోని ప్రధాన సభా మండపాన్ని పూర్వ ఏబీవీపీ కార్యదర్శి మదన్ దాస్ పేరు పెట్టినట్లు పేర్కొన్నారు. ఏబీవీపీ 75 వసంతాల అమృతోత్సవంలో భాగంగా ఈశాన్య భారత అధ్యయన యాత్రను నవంబర్ 5 నుంచి SEIL కార్యక్రమం ద్వారా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ యాత్ర ఈశాన్య భారత రాష్ట్రాల సాంస్కృతిక వారసత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. జాతీయ మహా సభలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ విద్యార్ది నాయకులు, విద్యార్ధులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ శ్రవణ్ బీరాజ్, నేషనల్ ఎక్జిక్యూటివ్ మెంబర్ ఛత్రపతి చౌహాన్, సిటీ సెక్రెటరీ శ్రీకాంత్, స్టేట్ జాయింట్ సక్రటరీ కమల్ సురేష్, శ్రీనాథ్, పృధ్వీ పాల్గొన్నారు.