100 Years Of NTR: వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో- శత జయంతి వేళ అభిమానులకు అదిరిపోయే న్యూస్
శత జయంతి వేళ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు పురందేశ్వరి. వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో ముద్రించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు.
శతజయంతి సందర్భంగా పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా నివాళి అర్పించి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు లీడర్లు. ఆంధ్రప్రదేశ్‌కు, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలకు చేసిన మేలును స్మరించుకుంటున్నారు.
వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ ఫొటో
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు దగ్గుబాటి పురందేశ్వరి. ఇవాళ్టి(మే 28) నుంచి వచ్చే ఏడాది మే 28 వరకు అంటే ఏడాది పాటు ఉత్సవాలు జరుగుతాయన్నారామె. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 12 కేంద్రాలు గుర్తించామని... అక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయన్నారు. శత జయంతి ఉత్సవాలు చెయ్యడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశామని పెర్కొన్నారు. ఈ కమిటీలో బాలక్రిష్ణ, రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖులకు స్థానం కల్పించారు. ఎన్టీఆర్ ఫోటోను వంద రూపాయల నాణెంపై ముద్రించేలా అర్‌బీఐతో మాట్లాడుతున్నామని తెలిపారు పురందేశ్వరి. ఈ వేడుకల్లో అన్ని రంగాలలో నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరం చేస్తామని ప్రకటించారు.
ప్రధాని కావాల్సిన వ్యక్తి
తెలుగు బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని అభిప్రాయపడ్డారు తెలంగాణ నేతలు. ప్రధానమంత్రి అవ్వాల్సిందని జస్ట్‌లో మిస్సయ్యారని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అప్పుడు ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకే నేటికీ అభిమానులు అదే మార్గాన పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు.
భారత రత్నకు అర్హుడు
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. భారత రత్నకు ఆయన అర్హుడని కామెంట్ చేశారు. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనికి తార స్థాయిలో అభిమానులు ఉన్నారని తెలిపారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్ టి ఆర్ అంటూ ప్రశంసించారు.
ఎన్టీఆర్ బాటలో కేసీఆర్
ఎన్టీఆర్ చూపిన బాటలోనే.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణలో తన పాలన చేస్తున్నారని తెలిపారు మరో టీఆర్‌ఎస్ లీడర్ మోత్కుపల్లి నర్సింహులు. దళిత బంధు పథకం ఆ కోవలోనేది అన్నారు. భూ స్వాములు పెత్తనాన్ని తొక్కిపెట్టి పేదవాడి ఆకలి తీర్చిన మహా నేతగా ఆయన్ని అభివర్ణించారు. ఆయన కంటే మహా నాయకుడు ఎవరూ లేరన్నారు. పెంకుటు ఇల్లును పరిచయం చేసిందని ఎన్టీఆర్ అని అన్నారు. వాస్తవానికి తనకు అర్థ రూపాయి ఆస్తి లేకపోయినా తన పెళ్లికి వచ్చి భోజనం చేసి ముందుకు నడిపించిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి.
ఈ మాట ఆయన పెట్టిన భిక్షే
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నామన్నారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పరిటాల సునీత. ఇలా పదిమందిలో మాట్లాడుగలుగుతున్నామంటే... ఆ రోజుల్లో ఆయన పెట్టిన బిక్షే అని అన్నారు. ఆయన ఎప్పుడూ జనం హృదయాల్లో బతికే ఉంటారన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశజ్యోతి ఎన్ టి ఆర్ అని అన్నారు. సునీత.
బంగారు పూలతో పాదపూజ
ఎన్టీఆర్‌కు నివాళి అర్పించిన సినీ నటుడు రాజేంద్రప్రసాద్.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అయన ద్వారా తాను మద్రాస్ వెళ్లి మద్రాస్ ఫిలిం స్కూల్‌లో జాయిన్ అయ్యానన్నారు. ఎన్టీఆర్ తనకు దేవుడితో సమానమనీ... ఇంట్లో మనిషి అని అభిప్రాయపడ్డారు. పది మంది తోటి వారికి సాయం చేస్తేనే ఆయనకు చేసే ఘన నివాళి అంటు తెలిపారు. కళ్ల ముందే చూసిన దేవుడని... సమాజమే దేవాలసయం అన్న గొప్ప మనిషిగా కీర్తించారు. ఆయన బతికే ఉంటే ఇవాళ బంగారు పూలతో పాద పూజ చేసేవాడినన్నారు రాజేంద్రప్రసాద్.