TSRTC Special Services : ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, దసరాకు 4198 స్పెషల్ బస్సులు!
TSRTC Special Services : దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. అదనంగా 4198 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది.
TSRTC Special Services : దసరా పండుగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది. తెలంగాణలో అదనంగా 4198 అదనపు బస్సులను నడుపుతున్నట్టు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారమన్నారు. దసరా పండుగ సంబరాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 26వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానుండడంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సుమారు 4 వేలకు పైగా బస్సుల నడిపేందుకు నిర్ణయించారు. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడుపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ఇక ప్రయాణికుల రద్దీ ఎక్కువైతే, బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రతిపాదనలు సీఎండీ కార్యాలయానికి పంపినట్లు తెలిసింది. మియాపూర్, కూకట్‌పల్లి, జేబీఎస్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీనగర్, కోఠి ప్రాంతాల నుంచి దసరా స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.
శంషాబాద్ ను హైటెక్ సిటీకి మరింత దగ్గర చేస్తూ ప్రతి అరగంటకొక బస్సు మరియు ప్రతి రోజూ ప్రయాణించే వారికి 10 శాతం రాయితీ.#TSRTCAirportService pic.twitter.com/oyWrrnuOM9
— Managing Director - TSRTC (@tsrtcmdoffice) September 18, 2022
మరో ఆరు పుష్పక్ బస్సులు
శిల్పారామం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరో ఆరు పుష్పక్ ఏసీ బస్సులు ఈనెల 19 నుంచి నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. ఉదయం గం.4.30ల నుంచి రాత్రి గం. 22.30ల వరకు పుష్పక్ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సులో ప్రయాణించే వారు అప్ అండ్ డౌన్ టిక్కెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పిస్తున్నారు. టిక్కెట్ ధరను రూ.250గా నిర్ణయించారు.
ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరగనున్నాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా రద్దీ తగ్గింది. కానీ ఈసారి రద్దీ పెరిగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో ఇంద్రకీలాద్రికి వస్తారని ఏపీఎస్ఆర్టీసీ అంచనా వేస్తోంది. ఇందుకోసం ఈ నెల 29 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు స్పెషల్ బస్సులు నడుపుతోంది. విజయవాడ నుంచి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ ప్రకటించింది. హైదరాబాద్, రాజమండ్రి, విశాఖ, తిరుపతి, బెంగళూరు, భద్రాచలం, చెన్నైతో పాటు ఇతర ప్రాంతాలకు కలిపి 1081 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. వీటిలో స్పెషల్ ఛార్జీలు వసూలు చేయడంలేదని ఆర్టీసీ తెలిపింది. సాధారణ ఛార్జీలతోనే స్పెషల్ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేసింది.
Also Read : సింగిల్ విండో- డబుల్ దందా- కరీంనగర్‌లో భవన నిర్మాణాలకు అనుమతుల లొల్లి
Also Read : Prakash Raj : ప్రకాష్ రాజ్ దత్తత తీసుకుంటే అంతే - కొండారెడ్డి పల్లెను చూస్తే !