TRS Leaders on BJP: బీజేపీ రాజకీయ పార్టీ కాదు, రాబందుల పార్టీ - టీఆర్ఎస్ నేతలు ఫైర్
TRS Leaders Fires on BJP: బీజేపీ రాజకీయ పార్టీ కాదని రాబందుల పార్టీ అంటూ టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవితపై కావాలనే ఆరోపణలు చేస్తూ.. ఇంటిపై దాడి చేశారని మండిపడ్డారు.
TRS Leaders Fires on BJP: బీజేపీ పార్టీ రాజకీయ పార్టీ కాదని, రాబందుల పార్టీ అని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ కార్యాలయలో ప్రెస్ మీట్ పెట్టారు. ఇందులో భాగంగానే బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ప్రత్యర్థులను వేధించడంలో అన్ని రికార్డులను కేంద్ర ప్రభుత్వం అధిగమించిందన్నారు. అలాగే ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ప్రభుత్వం కూల్చి వేస్తోందంటూ ఆరోపించారు. మోడీ, అమిత్ షాల అరాచకాలకు హద్దు లేకుండా పోతుందన్నారు. ఇపుడు వారి అరాచక దృష్టి తెలంగాణ పై పడిందని.. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఎమ్మెల్సీ కవిత కు సంబంధం లేని కేసులో ఇరికించాలని చూస్తున్నారంటూ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏక్కడో ఢిల్లీ జరిగిన స్కాంకు కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి చిల్లర రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడే ప్రసక్తే లేదన్నారు.
కవిత జోలికి వస్తే ఊరుకునేదే లేదు..!
నిన్న ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తాము ఖండిస్తున్నట్లు ఏ జీవన్ రెడ్డి తెలిపారు. బీజేపీ రౌడీయిజం, మోడీ ఈడీ ఇజం తెలంగాణలో నడవవు అంటా కామెంట్లు చేశారు. కవిత మీద ఆరోపణలు చేసిన వారి మీద లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయని గుర్తించారు. కవిత, తెలంగాణ బతుకమ్మ జోలికి వస్తే బీజేపీ బతుకు బుగ్గి పాలవుతుందని హెచ్చరించారు. కవితకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. సీబీఐ, ఈడీ, ఐటీ డిపార్మెంట్లు బీజేపీ జేబు సంస్థలు, కీలు బొమ్మలుగా మారాయంటూ ఏ జీవన్ రెడ్డి ఆరోపించారు.
రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కోలేక అనేక రకాల వ్యవస్థలను దుర్వినియోగం చేస్తుందన్నారు. కేసు గురించి సంస్థలు చెబుతాయా.. బీజేపీ నేతలు చెబుతారా అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేస్తానని ఇప్పటికే కవిత ప్రకటించారని గుర్తు చేశారు. ఏ విచారణకైనా కవిత సిద్ధంగా ఉంటారని తెలిపారు. కవిత జోలికి వస్తే యావత్ తెలంగాణ కన్నెర్ర చేస్తుందని వివరించారు. 60 లక్షల టీఆర్ఎస్ సైన్యం ఎమ్మెల్సీ కవిత వెంట ఉందని తెలిపారు. తాము తలుచుకుంటే బీజేపీ నేతలు రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు.
బీజేపీ అటెన్షన్ డైవర్షన్ పార్టీ..
కేంద్రాన్ని స్పష్టంగా, సూటిగా ప్రశ్నిస్తున్న నేత దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరేనని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. కేసీఆర్ ప్రశ్నలకు మోడీ, అమిత్ షా లకు వణుకు పుడుతోందన్నారు. కేంద్రంలో నడుస్తోంది మోడీ ప్రభుత్వం కాదు ఏడీ ప్రభుత్వం అని.. అంటే అటెన్షన్ డై వర్షన్ ప్రభుత్వం అంటూ కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ కేసీఆర్ ఉద్యమ బెబ్బులని తెలిపారు. కేసీఆర్ ను ఎదుర్కోలేక ఆయన కూతురు కవితపై బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని తెలిపారు. ఉద్యమంలో కూడా కేసీఆర్ పై ఇలాంటి ఆరోపణలు చేసినా ఉక్కు సంకల్పం తో నిలబెడ్డారని బాల్క సుమన్ గుర్తు చేశారు. బీజేపీకి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఓటు బ్యాంకు తప్ప ప్రజల అండ లేదని అన్నారు. బీజేపీ బెదిరింపు రాజకీయాలు ఇకనైనా మానాలని, కేసీఆర్ కుటుంబంపై బురద జల్లి ఎదో సాధిస్తామనుకుంటే కుదరదని హితవు పలికారు.