PK Political Party : పీకే పొలిటికల్ పార్టీ వెనుక సీఎం కేసీఆర్, కోదండరాం సంచలన కామెంట్స్
PK Political Party : ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే పీకే రాజకీయ పార్టీ వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అంటున్నారు. సీం కేసీఆర్ జాతీయ పార్టీ, పీకే పార్టీ ఒకటే అని ఆరోపిస్తున్నారు.
PK Political Party : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రాజకీయా పార్టీ పెడుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన బిహార్ నుంచి తన రాజకీయ ప్రయాణం మొదలుపెడతారని వార్తలు వచ్చాయి. ఈ ఊహాగావాలకు ప్రశాంత్ కిషోర్ సోమవారం చేసిన ట్వీట్ మరింత బలం చేకూరుస్తోంది. అయితే పీకే పొలిటికల్ ఎంట్రీపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీ ప్రకటన వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ జాతీయ పార్టీ, ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్కటేననే అనుమానం కలుగుతుందని కోదండరాం అన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం పీకేను వాడుకుంటున్నారని ఆరోపించారు.
రాహుల్ సభకు అనుమతి ఇవ్వాలి
ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వాలని ప్రొఫెసర్ కోదండరాం కోరారు. రాహుల్ గాంధీతో మాట్లాడాలని విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పారు. వివిధ పార్టీల నాయకులతో మాట్లాడితే యూనివర్సిటీ విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. యూనివర్సిటీలో సభలకు అనుమతి బాధ్యత వర్సిటీ అధికారులదే అన్నారు. వచ్చే ఎన్నికల కోసం 25 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి పోటీచేస్తామని కోదండరాం పొత్తులపై స్పష్టత ఇచ్చారు.
పీకే ట్వీట్ లో ఏముంది?
కాంగ్రెస్ పార్టీతో చర్చలు బెడిసికొట్టడంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొత్త పార్టీ స్థాపించనున్నారా? ఎందుకంటే ఆయన తాజాగా చేసిన తర్వాత ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రశాంత్ కిషోర్ సోమవారం ఉదయం ఓ ట్వీట్ చేస్తూ, ఇప్పుడు నిజమైన గురువులను అంటే ప్రజలకు చేరువ కావాల్సిన సమయం ఆసన్నమైందని, ‘జన్ సూరజ్’ సమస్యలను, వారి మార్గాన్ని బాగా అర్థం చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు. నిజానికి ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారనే చర్చ చాలా కాలంగా సాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు గురించి ప్రశాంత్ కిషోర్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అయితే కాంగ్రెస్, ప్రశాంత్ కిషోర్ మధ్య చర్చలు ఫలించకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరలేదు.
రియల్ మాస్టర్ ఎవరు?
ప్రశాంత్ కిషోర్ బిహార్ నుంచి తన ప్రయాణం ప్రారంభిస్తానని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో అర్ధవంతమైన భాగస్వామిగా ఉండటం, ప్రజా అనుకూల విధానాన్ని రూపొందించడంలో సహాయపడటం కోసం సిద్ధమవుతున్నానని అన్నారు. ‘‘ఇప్పుడు ‘రియల్ మాస్టర్’ వద్దకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. అంటే ప్రజలకు ఉన్న సమస్యలు, ప్రజలకు న్యాయం అందించే సరైన మార్గాన్ని బాగా అర్థం చేసుకోవడానికి రెడీ అవుతాను. ప్రయాణం బిహార్‌తో ప్రారంభం కానుంది.’’ అంటూ రాసుకొచ్చారు.