Revanth Reddy: కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ భరించదు, ఇప్పటికే రెండు సార్లు మోసపోయాం: రేవంత్ రెడ్డి
రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎంపై రేపు తెలంగాణలోని పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు పెట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్-కాంగ్రెస్ ఎప్పటికీ కలవవన్నారు.
![Revanth Reddy: కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ భరించదు, ఇప్పటికే రెండు సార్లు మోసపోయాం: రేవంత్ రెడ్డి Hyderabad Revanth reddy criticizes cm kcr congress trs bjp doing combined politics Revanth Reddy: కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ భరించదు, ఇప్పటికే రెండు సార్లు మోసపోయాం: రేవంత్ రెడ్డి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/13/d25895e6a2ab283cd23d61632f69ab12_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హేమంత్ బిశ్వ శర్మ(Himanth Biswa Sharma) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC President Revanth Reddy) మండిపడ్డారు. అస్సాం సీఎం దేశంలో ఉండే మాతృమూర్తులందరినీ అవమానించే విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ, నడ్డా, రాష్ట్ర నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్(Bandi Sanjay) స్పందించకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తామని చెప్పుకునే ప్రధాని మోదీ(PM Modi) అస్సాం సీఎంని బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రేపు తెలంగాణలోని 709 పోలీస్ స్టేషన్ లలో అస్సాం సీఎం(Assam CM) పై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో అస్సాం సీఎం పై తానే స్వయంగా ఫిర్యాదు చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
' అస్సాం సీఎం అసహ్యంగా, జుగుప్సాకరంగా దేశ సంస్కృతికి మచ్చ తెచ్చేలా దిగజారి మాట్లాడారు. ఇది ఒక్క రాహుల్ గాంధీ(Rahul Gandhi) కుటుంబానికి కాదు 140 కోట్ల భారతీయులకు, మాతృమూర్తులకు జరిగిన అవమానం. కేంద్రం అవినీతిపై కేసీఆర్ దగ్గర సమాచారం ఉంటే ఎందుకు బయటపెట్టడం లేదు. బీజేపీ, టీఆర్ఎస్ రెండు తోడు దొంగలే. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు దోచుకుంటున్నారు. ఆయన జాతకం ఈయన దగ్గర ఉంది అంటున్నారు. మరి ఎందుకు బయటపెట్టడం లేదు. సీఎం కేసీఆర్(CM Kcr) అవినీతి చిట్టా మా దగ్గర ఉందని అంటున్నారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అవినీతి సమాచారం ఉంటే దాయడం కూడా నేరమే. కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ భరించదు. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్ ను నమ్మి మోసపోయాం. గొంతులో ప్రాణం ఉన్నంతవరకు కేసీఆర్ ని నమ్మం' అని రేవంత్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్-కాంగ్రెస్(TRS-Congress) ఎప్పటికీ కలవవని, ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద ఈ ఇంటి కాకి ఆ ఇంటి మీద వాలదని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చి పడేస్తామన్నారు. ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు.
రాజకీయాలను బీజేపీ కలుషితం చేసింది : గీతారెడ్డి
బీజేపీ దేశంలో నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి(Geeta Reddy) ఆరోపించారు. భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమన్న ఆమె.. మహిళలాలను ఎంతో గౌరవించే దేశం మనదన్నారు. అలాంటిది అస్సాం ముఖ్యమంత్రి రాహుల్ గాంధీపై నీచమైన భాషతో మాట్లాడారన్నారు. దేశంలో మోదీ, అమిత్ షా, నడ్డాలు రాజకీయాలను పూర్తిగా కలుషితం చేస్తున్నారన్నారు. ఇంత ఘోరంగా రాజకీయాలు ఎన్నడూ లేవన్నారు. కుటుంబాల గురించి మాట్లాడి బీజేపీ(Bjp) ప్రపంచంలో దేశ ప్రతిష్టను దిగజారుస్తుందన్నారు. అస్సాం సీఎంపై బీజేపీ వెంటనే చర్యలు తీసుకొని ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)