Nampally Fire Accident: నాంపల్లి అగ్ని ప్రమాదం - భవన యజమాని రమేశ్ జైశ్వాల్ అరెస్ట్, 14 రోజుల రిమాండ్
Hyderabad Fire Accidents: నాంపల్లి బజార్ ఘాట్ లో ఘోర అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి భవన యజమానిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం నిందితునికిి 14 రోజుల రిమాండ్ విధించింది.
Nampally Fire Accident Building Owner Arrested: హైదరాబాద్ నాంపల్లి (Nampally) బజార్‌ఘాట్ (Bazarghat)లో ఇటీవల అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి బాలాజీ రెసిడెన్సీ యజమాని రమేశ్ జైశ్వాల్ (Ramesh Jaiswal) ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని కోర్టులో హాజరు పరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో నిందితున్ని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. నిందితుడు గత కొంతకాలంగా అక్రమంగా కెమికల్స్ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గతంలో పలుమార్లు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చినా, అపార్ట్ మెంట్ లో డ్రమ్ముల్లో కెమికల్స్ నిల్వ ఉంచి విక్రయించడం మానలేదు. ఈ క్రమంలో ఈ నెల 13న గ్రౌండ్ ఫ్లోర్ లో కారు రిపేర్ చేస్తుండగా, నిప్పు రవ్వలు అంటుకుని ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా, దట్టమైన పొగ అలుముకుని దాదాపు 20 మందికి పైగా ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. ఘటనపై ఐపీసీ సెక్షన్లు 304, 285, 286 కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి భవన యజమానిని రమేశ్ ను అరెస్ట్ చేశారు. ఈ నెల 11న సాయంత్రం నిందితుడు 35 కిలోల రెసిన్ ఉన్న 32 డబ్బాలను కొనుగోలు చేసి వాటిని గ్రౌండ్ ఫ్లోర్ లో నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిప్పు రవ్వలు అంటుకుని భారీగా మంటలు చెలరేగినట్లు చెప్పారు.
ప్రమాదం ఎలా జరిగిందంటే.?
ఈ నెల 13న సోమవారం ఉదయం నాంపల్లి బజార్ ఘాట్ లోని అపార్ట్ మెంట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లోని గ్యారేజీలో కారు రిపేర్ చేస్తుండగా అక్కడే ఉన్న కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో నాలుగో అంతస్తు వరకూ మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. 6 ఫైరింజిన్ల సాయంతో తీవ్రంగా శ్రమించి మంటలు అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తాజాగా, ప్రమాదంలో గాయపడిన తల్హా నాసర్ (17) అనే విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 10కి చేరింది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు, ఓ చిన్నారి కూడా ఉన్నారు. ప్రమాద ధాటికి దట్టంగా పొగ అలుముకోగా 21 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. భవనంలో చిక్కుకున్న వారిని నిచ్చెనల సాయంతో ఫైర్ సిబ్బంది రక్షించారు. అటు, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల సాయం ప్రకటించింది.
'కెమికల్ నిల్వలే కారణం'
భవన యజమాని రమేశ్ జైశ్వాల్ అపార్ట్ మెంట్ సెల్లార్ లో కెమికల్ నిల్వలు ఉంచి వ్యాపారం చేస్తున్నాడు. ప్రమాదం సమయంలో 30 డ్రమ్ములు పూర్తిగా కాలిపోగా, మరో 100 డ్రమ్ములను అగ్ని మాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాలు నిల్వ ఉంచడం వల్లే మంటలు ఒక్కసారిగా అంటుకుని వేగంగా వ్యాపించినట్లు తెలుస్తోంది. కెమికల్ డ్రమ్ములను చాలా రోజులుగా నిల్వ ఉంచినా ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు తాజాగా, భవన యజమానిని అరెస్ట్ చేసి కోర్టు ఆదేశాలతో రిమాండుకు తరలించారు.