Hyderabad News : సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు, అందుకే అసోం సీఎంకు అడ్డుపడ్డా- నందు బిలాల్
Hyderabad News : గణేశ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన అసోం సీఎం ... కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందుకే ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నాని నందు బిలాల్ అన్నారు.
Hyderabad News : హైదరాబాద్ గణేశ్ నిమజ్జనంలో పాల్గొనేందుకు వచ్చిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాజకీయాలు మాట్లాడడం సరికాదన్ని టీఆర్ఎస్ నేత నందు బిలాల్ అన్నారు. సీఎం కేసీఆర్ దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అసోం సీఎం హిమంత బిశ్మ శర్మ ఉన్న సభా వేదికపై మైకు లాక్కెళ్లిన గోషామహల్ టీఆర్ఎస్ నేత నందు బిలాల్ మాట్లాడుతూ.. ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన తర్వాత అసోం సీఎం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. తర్వాత ఛార్మినార్ నుంచి మొజాంజాహీ మార్కెట్ వద్దకు వచ్చిన హిమంత బిశ్వ భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలో గోషామహల్ టీఆర్ఎస్ సీనియర్ నేత నందు బిలాల్ వేదికపైకి వెళ్లి మైక్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎంకు మాట్లాడే అర్హత లేదన్నారు. వేదికపైనే అసోం సీఎం హిమంత బిశ్వను నందు బిలాల్ హెచ్చరించారు. అనంతరం పోలీసులు నందు బిలాల్ ను అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.
రెచ్చగొట్టేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోం
పోలీస్ స్టేషన్ వద్ద నందు బిలాల్ మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గణేశ్ ఉత్సవాలకు వచ్చిన అసోం సీఎం రాజకీయాలు మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ దూషించినందుకే ఆయనను మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నానన్నారు. హైదరాబాద్‌లో అసోం సీఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా జరుగుతుంటే బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
ఆందోళన దిగిన టీఆర్ఎస్ నేతలు
ఎంజే మార్కెట్ చౌరస్తా వద్ద భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపైన అసోం సీఎం హేమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ పైనా అసోం సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ గోషామహల్ టీఆర్ఎస్ నేత నంద కిషోర్ వ్యాస్ బిలాల్ అసోం సీఎం ప్రసంగాన్ని అడ్డుకొని మైకును లాగేశారు. దీంతో వెంటనే ఉత్సవ సమితి నిర్వాహకులు నందు బిలాల్ ను సభ వేదిక నుంచి కిందికి తోసేశారు. అప్రమతమైన పోలీసులు నందు బిలాల్ ను అరెస్ట్ చేసి అక్కడి నుండి తరలించారు. దీంతో నందు బిలాల్ అనుచరులు, టీఆర్ఎస్ మహిళ నేతలు తమ నాయకుడు నందు బిలాల్ అరెస్ట్ ను నిరసిస్తూ స్టేజ్ ముందు బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తమ నాయకుడిని బేషరత్తుగా పోలీసులు విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో మహిళ పోలీసులు ఆందోళనకు దిగిన మహిళలను అదుపులోకి తీసుకున్నారు.