Minister KTR : బిహార్ బాలిక వీడియోపై స్పందించిన మంత్రి కేటీఆర్, సాయం చేస్తానని హామీ
Minister KTR : బిహార్ కు చెందిన దివ్యాంగ బాలిక గెంతుకుంటూ పాఠశాలకు వెళ్తోంది. ఈ వీడియో వైరల్ అయింది. ఈ బాలికకు సాయం చేసేందుకు మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు.
Minister KTR : మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటాయి. సామాజిక మాధ్యమాల ద్వారా తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరిస్తుంటారు. అలాగే ఎవరైన సాయం కోరితే తన టీమ్ ద్వారా బాధితులకు సాయం అందేలా చేస్తుంటారు. ఇందుకోసం మంత్రి కేటీఆర్ టీమ్ నిరంతరం పనిచేస్తుంటుంది. తాజాగా కేటీఆర్ మరో బాలికకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఒంటికాలితో కుంటుకుంటూ పాఠశాలకు వెళ్తోన్న బాలిక వీడియో ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడియో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు పలువురు నెటిజన్లు. బాలిక వివరాలు తెలియజేస్తే ఆమెకు సాయం అందిస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
If someone at @ANI can me the girl’s contact details, will be my pleasure to help (in my personal capacity) the young one achieve her dreams https://t.co/5gBoFAsIv0
— KTR (@KTRTRS) July 1, 2022
బిహార్ కు చెందిన బాలిక
బిహార్‌కి చెందిన 11 సంవత్సరాల ప్రియాన్షు అనే బాలికకు చదువు అంటే ఎంతో ఆసక్తి. ఇతర పిల్లల్లా చెంగు చెంగుమని గెంతుతూ పాఠశాలకు వెళ్లే అదృష్టం తనకి లేకపోయింది. అయినా పట్టువీడలేదు ప్రియాన్షు. వికలాంగురాలైన ప్రియాన్షుకు ఒకే కాలు ఉంది. ఒంటికాలుతోనే ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు గెంతుతూ వెళ్తోంది. నడవటానికి రెండో కాలు లేకపోవడంతో ఒక్క కాలుతోనే గెంతుకుంటూ వెళ్లి వస్తుంటుంది. బాగా చదువుకోవాలనే పట్టుదల తన లోపాన్ని జయించేలా చేస్తుందని బాలిక అంటోంది.
ఆర్థిక స్తోమత లేక
బిహార్ రాష్ట్రం సివాన్ జిల్లాలోని బంటు శ్రీరామ్ గ్రామానికి చెందిన ప్రియాన్షు దివ్యాంగురాలు. ప్రియాన్షు ఇంటి నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పాఠశాల ఉంది. అయితే ఒకే కాలుతో గెంతుకుంటూ స్కూల్‌కి వెళ్లడం ఇబ్బందిగా ఉంటోందని ప్రియాన్షు వాపోతుంది. అందువల్ల రోజూ స్కూల్‌కి ఆలస్యం అవుతోందని బాలిక అంటోంది. తండ్రి కూలి పని చేసి కుటుంబాన్ని పోషించడంతో కృత్రిమ కాలు అమర్చే ఆర్థిక స్తోమత లేకపోయిందని తెలిపింది. తన సమస్యను జిల్లా అధికారులతో పాటు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరింది ప్రియాన్షు. ఎలాగైనా తనకు కృత్రిమ కాలు అమర్చాలని వేడుకుంటుంది.
Also Read : KTR Letter To PM Modi : బీజేపీ సమావేశాల రియల్ అజెండా విద్వేషం, ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ లేఖ