Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులపై మెట్రో ఛార్జీల భారం పడనుంది. రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో రాయితీ తొలగిస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్ అధికారులు షాక్ ఇచ్చారు. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీలలో కోత విధిస్తున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. మెట్రో రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో రాయితీ ఎత్తివేయనున్నట్లు వెల్లడించారు. సూపర్ సేవర్ హాలీడే కార్డు ఛార్జీలు పెంచనున్నట్లు తెలిపారు. మెట్రో కార్డు, క్యూఆర్ కోడ్‌పై ఇప్పటి వరకు ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం రాయితీ ఇచ్చేవారు. ఇప్పుడు ఈ డిస్కౌంట్ పై కోత విధించనున్నారు. శనివారం నుంచి ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు రాయితీ ఉండదని ప్రకటించారు. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రయాణికులకు రాయితీ వర్తిస్తుందని మెట్రో అధికారులు తెలిపారు. సెలవు రోజుల్లో ప్రయాణించే హాలిడే కార్డు రూ.59 ధరను రూ.99కి పెంచుతున్నట్లు ప్రకటించారు. అదే విధంగా కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డుల ధరను కూడా పెంచుతున్నట్లు వెల్లడించారు.
ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు వర్తించదు
ప్రస్తుతం మెట్రో ప్రయాణికులకు అందుబాటులోని కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డ్స్, డిజిటల్ క్యూఆర్ టికెట్స్‌పై ఉన్న 10 శాతం రాయితీలను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీఎస్సీ, క్యూఆర్ టికెట్స్ రాయితీలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వర్తించవని మెట్రో అధికారులు తెలిపారు. హైదరాబాద్ మెట్రోలో ప్రతి రోజుకు 4.4 లక్షల మంది ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. మొత్తం మూడు కారిడార్లలో 57 స్టేషన్లు, 69 కిలోమీటర్ల మేర మెట్రో సేవలందిస్తోంది. ప్రస్తుతం సూపర్ సేవర్ ఆఫర్-59కు మెట్రోలో ఎంతో ఆదరణ ఉంది. ఈ సూపర్ సేవర్ ఆఫర్ ద్వారా 1.3 మిలియన్స్ ప్రయాణికులు ట్రావెల్ చేస్తున్నారు. ఈ ఆఫర్ మార్చి 31తో ముగిస్తుందని మెట్రో అధికారులు తెలిపారు.
సూపర్ సేవర్ ఆఫర్-99
కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌తో పాటుగా ఈ సూపర్ సేవర్ ఆఫర్‌ను తిరిగి ప్రవేశపెడుతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. అయితే వీటి ధరలు పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. సూపర్ సేవర్ ఆఫర్-59 స్థానంలో 99 ఆఫర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ సూపర్ సేవర్ ఆఫర్-99 పై ప్రయాణికులు 100 నోటిఫైడ్ హాలీడేస్ లో కేవలం రూ.99తో అన్‌లిమిటెడ్ ప్రయాణం చేయవచ్చు. సూపర్ సేవర్ ఆఫర్-59 స్మార్ట్ కార్డ్స్ ద్వారా కూడా ఈ ఎస్ఎస్ఓ-99 కొత్త ఆఫర్‌ను తీసుకోవచ్చని తెలిపింది. కొత్త సూపర్ సేవర్ ఆఫర్-99 ద్వారా 100 నోటిఫైడ్ హాలీడేస్ వివరాలు మెట్రో స్టేషన్లతో పాటు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది.
ఫేజ్ 2 పనులు
రోజు రోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రజారవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే అభివృద్ధి కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంలో ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న హైదరాబాద్ మెట్రో ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు అని తెలిసిందే. ఫేజ్ 1 లో భాగంగా మొత్తం 69 కిలోమీటర్ల మెట్రో లైన్ ఉంది. ఫేజ్ 2లో భాగంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 31 కిలోమీటర్ల మేర మెట్రో లైన్ విస్తరించనున్నారు. నాగోల్ - రాయదుర్గం కారిడార్ 3కి కొనసాగింపుగా ఎయిర్ పోర్ట్ వరకు ఫేజ్ 2 మెట్రో రూట్ మ్యాప్ పనులు జరుగుతున్నాయి. విమానాశ్రయం వరకు కనెక్ట్ చేయనున్న హైదరాబాద్ మెట్రో లైన్ కోసం రూ.6250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం మరో మూడేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని భావిస్తోంది.