Hyderabad Liberation Day: ఏకకాలంలో బ్రిటీషర్లు, నిజాంలపై పోరాడిన హైదరాబాద్, యుద్ధం మొదలైంది ఇక్కడే!
Hyderabad Liberation Day: నిజాంలతోనే కాకుండా అటు బ్రిటీషర్లతోనూ హైదరాబాద్ ప్రజలు పోరాటం చేయాల్సి వచ్చింది.
Hyderabad Liberation Day:
బ్రిటీషర్లు, నిజాంలతో పోరాటం..
భారత్‌లో స్వాతంత్య్ర ఉద్యమం ఎప్పుడు మొదలైందని చూస్తే...1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు ముందు వరుసలో కనిపిస్తుంది. కానీ...దేశమంతా ఆంగ్లేయ పాలనపై నినదించక ముందే..హైదరాబాద్ ఆ పని చేసింది. సిపాయిల తిరుగుబాటుకు 57 ఏళ్ల ముందే...హైదరాబాద్ ప్రజల నుంచి నిరసన ఎదుర్కొన్నారు బ్రిటీషర్లు. అప్పుడే హైదరాబాదీలు ఓ విషయం గ్రహించారు. తమ పోరాటం ఇద్దరు శత్రువులపై కొనసాగించాల్సి ఉంటుందని. ఒకే కాలంలో బ్రిటీషర్లు, నిజాంలపై యుద్ధం చేయాల్సి వస్తుందని తెలియడానికి వారికి ఎంతో కాలం పట్టలేదు. అసలు హైదరాబాద్‌లో స్వాతంత్య్ర పోరాటం ఎప్పుడు మొదలైంది..? అక్కడి ప్రజల్లో అంత ఆగ్రహం ఉన్నట్టుండి ఎలా పుట్టింది..?
రెండో నిజాం చేసిన పనితో..
రెండో నిజాం అలీఖాన్ చేసిన ఓ పని హైదరాబాద్ ప్రజల్లో అసహనాన్ని పెంచింది. బ్రిటీష్ వాళ్లతో చేతులు కలిపాడు రెండో నిజాం. సైనిక సాయం సహా పలు అంశాల్లో పరస్పర సహకారానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు రెండో నిజాం. అదిగో అక్కడ మొదలైంది అసలు కథ. అప్పటి నుంచి రెండో నిజాంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు హైదరాబాద్ ప్రజలు. అంతెందుకు. నిజాం కుటుంబానికే ఈ నిర్ణయం నచ్చలేదు. పైగా అంతటితో ఆగకుండా..రెండో నిజాం..ఆంగ్లో-మరాఠీ యుద్ధంలో బ్రిటీష్ వాళ్లకు సపోర్ట్ చేశాడు. కొందరు హిస్టారియన్లు చెబుతున్న ప్రకారం చూస్తే...బ్రిటీష్ వాళ్లపై హైదరాబాదీలకు ఎంత వ్యతిరేకత ఉందో తెలిసింది 1812లో. బెరార్ (Berar) ప్రావినెన్స్ గవర్నర్ రాజా మహిపత్ రామ్...బ్రిటీష్‌లకు వ్యతిరేకంగా పోరాడుతున్న హోల్కర్స్ (Holkars)కు మద్దతుగా ఉండమని మూడో నిజాం సికందర్ ఝాకి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. ఇది నిజాంకు ఆగ్రహం తెప్పించింది. అటు బ్రిటీష్ వాళ్లు కూడా ఈ విషయం తెలిసి మండిపడ్డారు. వెంటనే
మహిపత్‌ను గవర్నర్ పదవి నుంచి తొలగించాలని మూడో నిజాంకు ఆదేశాలు ఇచ్చారు బ్రిటీషర్లు. మరాఠా యోధుడు రావు రాంభా నింబాల్కర్ సహా నూరుల్ ఉమ్రా బహదూర్ 1818లో ఆంగ్లేయులపై పోరాటం చేశారు. ఆ తరవాత మూడో నిజాం కొడుకు ప్రిన్స్ ముబారిజ్ కూడా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడాడు. కర్నూల్ నవాబ్ రసూల్ ఖాన్ సహకారంతో ఉద్యమించాడు.
క్రమంగా పెరిగిన ఆగ్రహం..
ప్రిన్స్ ముబారిజ్ పోరాటానికి దిగకముందే...బ్రిటీష్ సైన్యంలోని కొందరు భారతీయులు ఆంగ్లేయుల నిరసన వ్యక్తం చేశారు. 1812 నుంచే ఈ వ్యతిరేకత చాప కింద నీరులా విస్తరించింది. కోటిలోని బ్రిటీష్ రెసిడెన్సీలో కొందరు సైనికులను పోస్ట్ చేయగా...ఆ సమయంలో బ్రిటీష్ కమాండర్ మేజర్ ఎడ్‌వర్డ్ గోర్డోన్‌ను కట్టేశారు. ఆ తరవాత ఈ పోరాటం కొనసాగుతూ వచ్చింది. 1835-55 మధ్య కాలంలో హైదరాబాద్‌లో అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జరిగాయి. 1855 సెప్టెంబర్‌లో బ్రిగేడియర్ కోలిన్ మెకంజీ మొహర్రం వేడుకలను అడ్డుకున్నాడు. హావల్దార్ గులాం ఖాదిర్ ఆగ్రహంతో...మెకంజీని కత్తితో పొడిచాడు. ఆ తరవాత భారత సైనికులు మొహర్రం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ ఘటనతో చాలా రోజుల పాటు బ్రిటీష్ అధికారులు భయంతో ఇళ్ల నుంచి బయటకు రాలేదట. అయితే..అంతకు ముందు 1827లోనే కల్నల్ డావియస్‌ను కాల్చి చంపారు. ఇలా..క్రమక్రమంగా పెరుగుతూ వచ్చిన పోరాటం 1857 జులై 17న తీవ్ర రూపం దాల్చింది. తురుం ఖాన్ఆ ధ్వర్యంలో బ్రిటీష్ రెసిడెన్సీపై దాడి జరిగింది. ఆగ్రహించిన బ్రిటీషర్లు...తురుం ఖాన్‌ను సుల్తాన్ బజార్‌లో ఉరి తీశారు.
చివరి నిజాంపై ఒత్తిడి..
భారత్‌కు స్వాతంత్య్రం రావటానికి రెండు వారాల ముందు నుంచే...హైదరాబాద్‌లో అలజడి మొదలైంది. భారత్‌లో చేరడమా..? పాక్‌లో విలీనమవడమా..? లేదంటా స్వతంత్య్ర దేశంగా ఉండడమా..? అన్న సందిగ్ధంలో ఉండిపోయాడు చివరి నిజాం. ఆయనపై క్రమంగా ఒత్తిడి పెరిగింది. ఈ ఆందోళనను తట్టుకోలేక...చివరకు ఆయన ఫర్మానా జారీ చేశాడు. నాయకులెవరూ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పాడు. అయినా...హైదరాబాద్ కాంగ్రెస్, ఆర్య సమాజ్ నిజాంపై ఒత్తిడి తెచ్చాయి. ఇండియన్ యూనియన్‌లో చేరాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలోనే...నిజాం చేసేదేమీ లేక వైస్‌రాయ్‌కి ఓ లేఖ రాశాడు. ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్‌ను విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఆ తరవాత 1948లో ఆపరేషన్ పోలోతో హైదరాబాద్ భారత్‌లో భాగమైంది.
(Image Credits: opindia)