HMDA Plots Sales : అందుబాటు ధరల్లో హెచ్ఎండీఏ ప్లాట్లు, ఇలా కొనుగోలు చేయొచ్చు!
HMDA Plots Sales : హెచ్ఎండీఏ పరిధిలోని 39 ల్యాండ్ పార్సిల్స్ ను ఆన్లైన్ లో విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. మార్చి 1న వేలం జరగనుంది.
HMDA Plots Sales : హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(HMDA) నగర శివారులోని ప్లాట్లను మార్కెట్ రేటుకు విక్రయించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో హెచ్ఎండీఏ ప్లాట్లను ఆన్ లైన్ విధానంలో వేలం వేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ వేలం ప్రక్రియను నిర్వహిస్తుంది. ధరలు అందుబాటులో ఉండడంతో మధ్యతరగతి ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మూడు జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో 39 ల్యాండ్ పార్సెల్స్ వేలం వేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 6, సంగారెడ్డి జిల్లాలో 23 ల్యాండ్ పార్సిల్స్ వేలంలో విక్రయానికి సిద్దంగా ఉంచారు. 121 గజాల నుంచి 10,164 గజాల వరకు స్థలాలను అందుబాటు ధరల్లో ఉంచారు.
వేలానికి 39 ల్యాండ్ పార్సిల్స్ సిద్ధం
మార్చి 1న మొత్తం 39 ల్యాండ్ పార్సిల్స్ ను ఆన్ లైన్ వేలం ద్వారా విక్రయించడానికి హెచ్ఎండీఏ సిద్ధమైంది. అన్ని అనుమతులతో, ఎటువంటి చిక్కులు లేకుండా క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్ పార్సెల్స్ వేలాని సిద్ధం చేసింది. ఈ స్థలాలను కొనుగోలు చేసిన వెంటనే నిర్మాణ అనుమతులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ వేలంలో పాల్గొనడానికి ఈనెల 27 సాయంత్రం ఐదు గంటల వరకు ఎంఎస్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజిస్టర్ చేసుకున్న వారు ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటల గడువు లోపు నిర్దేశించిన రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రంగారెడ్ది జిల్లా గండిపేట మండలంలో 3, శేరిలింగంల్లి మండలంలో 5, ఇబ్రహీంపట్నం మండలం పరిధిలో 2 చోట్ల ల్యాండ్ పార్సెల్స్ వేలానికి సిద్ధం చేశారు. మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలంలో 4, ఘట్ కేసర్ మండలంలో 1, బాచుపల్లి మండలంలో ఒకటి చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఉండగా, సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలో 16, ఆర్సీ పురం మండలంలో 6, జిన్నారం మండలంలో 1 చొప్పున ల్యాండ్ పార్సిల్స్ ఆన్ లైన్ లో వేలం వేయనున్నారు.
ఈ నెల 21 నుంచి అవగాహన సమావేశాలు
హెచ్ఎండీఏ వేలం వేస్తున్న ల్యాండ్ పార్సిల్స్ పై కొనుగోలుదారులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం నుంచి ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 21న రంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సిల్స్ పై శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసులో, 22వ తేదీన సంగారెడ్డి జిల్లా ల్యాండ్ పార్సిల్స్ పై ఆర్సీ పురంలోని లక్ష్మీ గార్డెన్స్ లో, 23న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ల్యాండ్ పార్సిల్స్ పై ఉప్పల్ స్టేడియం వద్ద సర్కిల్ ఆఫీసులో ప్రీ బిడ్ సమావేశాలు నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
కబ్జాలను కంట్రోల్ చేసేందుకు
హెచ్ఎండీఏ పరిధిలోని ఖాళీ స్థలాలు కబ్జాలకు గురికాకుండా విక్రయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అలాంటి స్థలాలను గుర్తించాలని హెచ్‌ఎండీఏని ఆదేశించింది. దీంతో అధికారులు హైదరాబాద్ జిల్లాతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఖాళీ స్థలాలను గుర్తించారు. భూకబ్జాలు పెరిగిపోతుండడం, వాటిని తిరిగి సొంతం చేసుకునేందుకు కోర్టులో పోరాడాల్సి వస్తుండడంతో ప్రభుత్వం ఆ స్థలాల అమ్మకం ద్వారా ఆదాయం పెంచుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. ఖాళీ స్థలాలను విక్రయించి సమస్యలకు చెక్ పెట్టాలని అనుకుంటున్నారు.