TS High Court : రాత్రి 10 గంటల తర్వాత నో సౌండ్, పబ్ ల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు!
TS High Court : హైదరాబాద్ లో పబ్ ల నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత ఎటువంటి సౌండ్ ఉండకూడదని ఆదేశించింది.
TS High Court : హైదరాబాద్ లో ఇళ్ల మధ్య పబ్ ల నిర్వహణ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. నిర్దేశించిన సౌండ్ నిబంధనలను ఉల్లంఘించిన పబ్‌లపై నమోదైన కేసులపై హైకోర్టు ఆరా తీసింది. నిబంధనలు ఉల్లంఘించిన పబ్ లపై ఇప్పటివరకు ఎన్ని కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులకు సంబంధించిన నివేదికను సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఈ కేసుల వివరాలు కోర్టులో సబ్మిట్ చేయాలని కోరింది. పబ్‌లలో మ్యూజిక్, డ్యాన్సులకు అనుమతులపై ఆరా తీసింది. పబ్‌లకు లైసెన్స్ మంజూరు చేసేటప్పుడు పరిగణనలోకి తీసుకుని అంశాలేంటో చెప్పాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది.
ప్రభుత్వానికి నోటీసులు
జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ అండ్ గ్రీన్ అసోసియేషన్ హైకోర్టులో ఇళ్ల మధ్య పబ్ నిర్వహణపై పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. డీజే సౌండ్‌లు, అధిక ధ్వని, డ్యాన్స్ ల వల్ల చుట్టు పక్కల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని పిటిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయంలో పోలీసులు, ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు చేసినా ఎవరూ స్పందించడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కోర్టు దీనిపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్ లో పబ్ నిర్వహణపై హైకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పబ్స్ నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సోమవారం నుంచి రాత్రి 10 దాటితే పబ్స్ లో ఎటువంటి సౌండ్ ఉండకూడదని హైకోర్టు ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పోల్యుషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత పరిమితి వరకే అనుమతి ఇచ్చింది.
పబ్ లో డ్రగ్స్ పార్టీలపై
హైదరాబాద్ లోని పలు పబ్ లో డ్రగ్స్ పార్టీలు జరిగిన ఘటనలు ఇటీవల వెలుగుచూశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యి నిబంధనలు కఠినతరం చేసింది. ముఖ్యంగా పబ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ పలు ఆదేశాలు ఇచ్చింది. గీత దాటితే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదు అని స్పష్టం చేసింది. పబ్‌లో అసాంఘిక కార్యక్రమాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. పబ్ ను పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కవర్ అయ్యేలా ఏర్పాటు చేయాలి. అలా కెమెరాలు ఏర్పాటు చేయని పబ్ ను మూసివేయాలని పోలీసులను ఆదేశించింది ఎక్సైజ్ శాఖ. అదే విధంగా పబ్ కెమెరాలను పోలీసులకు అనుసంధానం చెయ్యాలని సూచించింది. పబ్ లో మంచి బ్రాండ్ లు, మంచి ఫుడ్ అందుబాటులో ఉంచాలని, లైట్ మ్యూజిక్ ఉంటే చాలు అని సూచించింది. అశ్లీలం, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకుటామని పబ్ నిర్వాహకులను హెచ్చరించింది.
Also Read : Revanth Reddy : కాంగ్రెస్ అధికారంలో వస్తే వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను టీజీ చేస్తాం- రేవంత్ రెడ్డి
Also Read : Telangana Assembly: ఆ సంస్కరణలతో కేంద్రం భయంకర కుట్ర, మీకూ హిట్లర్‌కి పట్టిన గతే - అసెంబ్లీలో కేసీఆర్ ధ్వజం