Gaddar On KCR : నియంతలకు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుంది, గద్దర్ సంచలన వ్యాఖ్యలు
Gaddar On KCR : సీఎం కేసీఆర్ పై ప్రజాగాయకుడు గద్దర్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.
Gaddar On KCR : ప్రజా గాయకుడు గద్దర్ మరోసారి సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంతలకు ఎలాంటి గతి పట్టిందో కేసీఆర్ కు అదే పరిస్థితి వస్తుందన్నారు. శనివారం ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ఆయన... కేసీఆర్ పై విమర్శలు చేశారు. పొలిటీషియన్స్ సాధారణంగా ఆర్థిక హామీలిస్తారని, కానీ కేసీఆర్ మాత్రం పొలిటికల్ హామీలు చేశారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రజల ఆలోచనలు అర్థం చేసుకోవాలని కోరారు. కేసీఆర్ గతంలో రాజ్యాంగాన్ని మార్చాలని చేసిన వ్యాఖ్యలపై గద్దర్ స్పందించారు. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలో సీఎం కేసీఆర్ ప్రజలకు చెప్పాలన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ దళితులకు అనేక హామీలు ఇచ్చారని, ఆ తర్వాత వాటిని మర్చిపోయారని మండిపడ్డారు. దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోలేదన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానన్నారని, అది కూడా నెరవేరలేదన్నారు. దళితబంధు కూడా కొందరికే ఇస్తున్నారన్నారు. పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలన్న డిమాండ్‌ను సీఎం కేసీఆర్ తన జాతీయ ఎజెండాలో చేర్చాలని గద్దరు అన్నారు.
ప్రాణ హాని ఉందని ఫిర్యాదు
తనకు ప్రాణహాని ఉందని గద్దర్ ఇటీవల అధికారులను ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాలని జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, వెస్ట్ జోన్ డీసీపీ సీతారాములును కలిసి వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలోని మండల గూడెం గ్రామంలో బాల సాయిబాబా ట్రస్ట్ భూములు ప్రభుత్వానికి అప్పగించాలని పోరాటం చేయనున్నట్లు గద్దర్ తెలిపారు. దీంతో ఈ ప్రాంతానికి తరచూ వస్తున్నానన్నారు. అందువల్ల కొందరు ప్రజాప్రతినిధులు, రియల్టర్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్, డీసీపీలను కోరారు. మండల గూడెంలోని 59 ఎకరాల భూములు రియల్టర్ల చేతికి చిక్కాయని గద్దర్ ఆరోపించారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, సర్దార్ సర్వాయి పాపన్న పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బాలసాయి బాబా భూములను ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగించే వరకు తాను ఈ పోరాటం చేస్తానన్నారు. అయితే బాల సాయిబాబా ట్రస్ట్ కు చెందిన భూములను ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి విక్రయించినట్లు తెలుస్తుంది. ఈ భూముల విషయంపై ప్రజా గాయకుడు గద్దర్ రఘునాథపల్లి రెవెన్యూ అధికారులను కలిసి సమాచార హక్కు కింద దరఖాస్తు చేశారు.
ప్రజా సమస్యలపై గళమెత్తిన గాయకుడు
1997 ఏప్రిల్ 6న హైదరాబాద్‌లో ఆయన నివాసంలో గుర్తుతెలియని వ్యక్తులు గద్దర్ పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గద్దర్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. రెండు బుల్లెట్లు ఆయన ఛాతిలోకి దూసుకెళ్లాయి. అందులో ఓ బుల్లెట్ మాత్రం ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉనట్లు తెలుస్తోంది. ఆ బుల్లెట్ తొలగిస్తే ఆయన ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తెలపడంతో ఆ బుల్లెట్‌ను శరీరంలోనే విడిచిపెట్టారు. అయితే గద్దర్ మాత్రం ఇప్పటికీ ప్రజా సమస్యలపై గళమెత్తుతున్నారు. తన పాటలతో అవినీతిని నిలదీస్తున్నారు. తాజాగా బాల సాయిబాబాకు చెందిన భూముల విషయంలో పోరాటానికి గద్దర్ సిద్ధమవుతున్నారు. తనపై కొందరు దాడి చేసే అవకాశం ఉందని అధికారులకు ఫిర్యాదు చేయడంతో గద్దర్ మళ్లీ వార్తల్లో నిలిచారు.