Cyclone Asani : తెలంగాణపై అసని తుపాను ఎఫెక్ట్, మూడు రోజుల పాటు వర్షాలు
Cyclone Asani Effect On Telangana : ఏపీ తీరంలో సముద్రపు అలలు పోటెత్తున్నాయి. అసని తీవ్ర తుపాను ధాటికి ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తెలంగాణలోనూ మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Cyclone Asani Effect On Telangana : అసని తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో ఇప్పటికే ఇదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడుతుంటే, తెలంగాణలో కూడా వాతావరణం చల్లబడింది. తెలంగాణలో వచ్చే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40కి.మీ. వేగంతో ఈదురు గాలులతో వర్షం పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
తీరంలో అలజడి
బంగాళాఖాతంలో అసని తుపాను అలజడి సృష్టిస్తోంది. ఏపీ తీరం వైపు తుపాను పయనిస్తుంది. తీరం వైపు గంటలకు 6 కిలోమీటర్ల వేగంతో వస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం తుపాను కాకినాడకు 330 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. అసని తుపాను కారణంగా విశాఖ వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కుండ పోత వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలయమం కాగా రహదారులు చెరువులను తలపించాయి. దీంతో నగరంలో జనజీవనం స్థంభించింది. మరోవైపు సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. తీరం వెంబడి గంటకు 60-80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే విశాఖ వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. తుపాను ప్రభావంతో ఏపీలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి.
దిశ మార్చుకున్న అసని
అసని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలో తూర్పుగోదావరి, విజయవాడ, విశాఖపట్టణం, శ్రీకాకుళంలోనే గాక ఒడిశాలోని కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. గాలులు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని అంచనా వేస్తున్నారు. భారీగా వీస్తున్న ఈదురు గాలులు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను అసని దిశ మార్చుకుని పయనిస్తుంది. ఉత్తర కోస్తా-ఒడిశా మధ్యలో తీరం దాటుతుందనుకున్న తుపాను కృష్ణా జిల్లా మచిలీపట్నం వైపు దిశ మార్చుకుంది. రేపు సాయంత్రంలోపు మచిలీపట్నానికి సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తుంది. మచిలీపట్నం వద్ద తీరాన్ని తాకి తిరిగి విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశించే అవకాశముందని ఐఎండీ తెలిపింది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది.