Gutha Sukender Reddy On Governor : వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు- గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutha Sukender Reddy On Governor : గవర్నర్ వివాదంపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి స్పందించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
Gutha Sukender Reddy On Governor : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ కు మధ్య వివాదం కొనసాగుతుంది. బడ్జె్ట్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం హైకోర్టు కెక్కింది. గవర్నర్ అంశంపై అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. గాంధీ వర్ధంతి సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో గాంధీజీకి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ... రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వారు జాగ్రత్తగా వ్యవహరించాలని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు. ప్రభుత్వాలు మారడం కాదని, ప్రజల బతుకులు మారాలన్నారు. వక్రబుద్ధితో ఆలోచన చేసే వాళ్లకు మంచిబుద్ధి కలగాలని గుత్తా అన్నారు. దేశంలో మతోన్మాద శక్తులు, మరెన్నో రకరకాల సమస్యలు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. దేశంలోని సమాఖ్య వ్యవస్థ, లౌకిక విధానాన్ని కాపాడుకోవాలని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. వక్రబుద్ధితో కొందరు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. శాసన మండలి, శాసన సభ, గవర్నర్ ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు.
తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో నేడు జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.#GuthaSukenderReddy #Gandhi pic.twitter.com/qc2d2e4rTN
— Gutha Sukender Reddy (@Gutha_Sukender) January 30, 2023
అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు- స్పీకర్ పోచారం
ధనికుల ధనాన్ని పేదలకు పెడతాం అనే వ్యాఖ్యలకు మాత్రమే పరిమితం కావొద్దని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, అహంకార ధోరణితో ఉండొద్దని గాంధీ అనేవారన్నారు. శాంతి, సామరస్యంతోనే గాంధీజీ దేశానికి స్వాతంత్య్రం తెచ్చారన్నారు. గాంధీ చెప్పిన పద్ధతులను ప్రతి ఒక్కరూ అనుసరించాలన్నారు. మానవ వనరులు వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. పేదలకు మాటలతోనే కాకుండా చేతలతో కూడా సాయం చేయాలని స్పీకర్ సూచించారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలు తెలంగాణను అనుసరిస్తున్నాయని తెలిపారు. కేంద్రం కొన్ని విషయాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ వాస్తవాలను దాచలేకపోతుందని విమర్శించారు.
కోర్టుకెక్కిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం - రాష్ట్ర గవర్నర్ కి మధ్య విభేదాల వేళ వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ఇంత వరకూ ఆమోదం పొందకపోవడంపై బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లింది. సోమవారం (జనవరి 30) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా అందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా లంచ్ మోషన్ పిటిషన్‌కు అనుమతి ఇవ్వాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. రాష్ట్ర బడ్జెట్ డ్రాఫ్ట్ కాపీలకు గవర్నర్ ఆమోదం తెలపలేదని, మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉందని ఏజీ వివరించారు. ఆ లోపు గవర్నర్ ఆమోదం తెలపకపోతే బాగా ఇబ్బంది అవుతుందని ధర్మాసనానికి ఏజీ వివరించారు. ఈ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌కి, రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ఈ వివాదంలో తాము ఎలా జోక్యం చేసుకుంటామని అన్నారు. ‘‘గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయ సమీక్ష చేయొచ్చా? కోర్టులు మరీ ఎక్కువ జోక్యం చేసుకుంటున్నాయని మీరే అంటారు కదా? అసలు ఈ వ్యవహారంలో గవర్నర్ కు కోర్టు నోటీసులు ఇవ్వగలదా? మీరే ఆలోచించండి’’ అని సీజే అన్నారు.
అయితే, లంచ్ మోషన్ పిటిషన్ కు కనుక అనుమతిస్తే పూర్తి వివరాలు చెప్తానని అడ్వకేట్ జనరల్ చెప్పడంతో ఆ పిటిషన్‌కు బెంచ్ అంగీకరించింది. అయితే పిటిషన్ రెడీగా ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. రెడీగా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విచారణ చేపడతామని ఏజీకి స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు ఎలా ఉంటాయి? హైకోర్టు ఎలా స్పందిస్తుందనే దాని ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించనున్నారు.