Komatireddy Venkat Reddy : నోటీసులిస్తే జోడోయాత్రలో ఎలా పాల్గొంటా? - కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ నోటీసులకు సమాధానం ఇచ్చానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. తాను కాంగ్రెస్ లోనే ఉన్నానన్నారు.
Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పార్టీ నోటీసులపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి స్పందించారు. రెండు రోజుల క్రితం షోకాజ్ నోటీసులకు రిప్లై ఇచ్చానని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. పార్టీ జనరల్ సెక్రెటరీ తారిక్ అన్వర్ అందుబాటులో లేరన్నారు. భారత్ జోడో యాత్రలో ఎందుకు పాల్గొనడం లేదనే విషయంపై వెంకట్ రెడ్డి స్పందించారు. నోటీసులిస్తే జోడోయాత్రలో ఎలా పాల్గొంటా అని ప్రశ్నించారు. క్లీన్‌చిట్ వచ్చాకే రాహుల్ గాంధీ జోడోయాత్రలో పాల్గొంటానన్నారు. మునుగోడులో తన తమ్ముడు, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు ఫోన్ చేసిన ఆడియో ఇటీవల వైరల్ అయింది. వీటిపై కొందరు ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లిన కోమటిరెడ్డి ఎయిర్ పోర్టులో మునుగోడులో కాంగ్రెస్ గెలవదని చెప్పిన ఓ వీడియో కూడా వైరల్ అయింది. ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరిగివచ్చిన వెంకట్ రెడ్డి నోటీసులపై స్పందించారు.
సోదరుడికి సాయం!
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. స్టార్ట్ క్యాంపెయినర్‌గా ఉంటూ మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీకి ప్రచారం చేయకపోగా... తన సోదరుడికి సాయం చేయడం ఆయన్ని చిక్కుల్లో పడేసింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం నోటీసులు జారీ చేసింది. పదిరోజుల గడువుతో గతంలో నోటీసులు ఇచ్చింది. వాటికి వెంకట్‌రెడ్డి స్పందించలేదు. మళ్లీ నోటీసులు ఇచ్చింది. ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన ఆయన షోకాజ్ నోటీసులకు రిఫ్లై ఇచ్చారు. మునుగోడు నోటిఫికేషన్ పడిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండిపోయిన వెంకట్‌రెడ్డి... ప్రచారం పీక్స్‌కు చేరే సరికి ఆస్ట్రేలియా చెక్కేశారు. అంతే కాదు అక్కడి నుంచి తన అనుచరులకు ఫోన్లు చేసి... సోదరుడు, బీజేపీ అభ్యర్థిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయానికి సాయం చేయాలని రిక్వస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఆడియో లీక్ అయింది.
ఫేక్ ఆడియో అంటోన్న వెంకట్ రెడ్డి
ఈ ఆడియో, వీడియో టేపులపై వివరణ ఇవ్వాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని వెంకట్ రెడ్డి కోరుతున్నట్లుగా వైరల్ అయిన ఆడియో విషయంలో పార్టీ క్రమ శిక్షణా చర్యలలో భాగంగా ఎంపీకి పోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకోరాదో 10 రోజులలో సమాధానం చెప్పాలని వెంకట్ రెడ్డికి గడువు ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన.. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం సమయంలో ఇక్కడ ఉండకుండా ప్లాన్ చేసుకున్నారని పార్టీలోనూ ప్రచారం జరిగింది. అయితే మునుగోడులో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేనే లేదని ఆస్ట్రేలియాలో చెప్పిన వ్యాఖ్యలు ఇటీవల సంచలనం అయ్యాయి. తాను అక్కడ ఉండి మునుగోడులో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసినా ఉపయోగం లేదని, ప్రచారం చేస్తే మరో 10 వేల ఓట్ల వరకు వస్తాయన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా ఓడిపోతుందని తెలిసి, ప్రచారం చేయడంలో అర్థం లేదని వెంకట్ రెడ్డి ఆస్ట్రేలియాలో మాట్లాడారు. అయితే కాంగ్రెస్ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇస్తూ ఆడియో, వీడియోలు ఫేక్ అని కొట్టిపారేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్ఠానం వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా? లేక దాటవేస్తుందో? వేచిచూడాలి.