Hyderabad News: మీ వాహనానికి 9999 నెంబర్ కావాలా? దీనికి తాజాగా ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా?
Auction For Fancy Registration: కారు ఫాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఓ యజమాని ఏకంగా రూ. 25.5 లక్షలు ఖర్చు చేశాడు. ఒక కారు నెంబర్ కోసం ఇంత ఖర్చు చేస్తారా అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Fancy Registration Number: హైదరాబాద్‌లో ఓ వ్యక్తి చేసిన పని తెలిస్తే ఆశ్చర్యం వేయక తప్పదు. తన కారు రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం ఏకంగా రూ. 25.5 లక్షలు ఖర్చు చేశాడు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్‌ను టీఎస్ (TS) సిరీస్ నుంచి టీజీ (TG)గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ఫాన్సీ నెంబర్ల వేలంలో ఒక కారు యజమాని ‘9999’ నెంబర్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు.
టీజీ సిరీస్ ‘9999’ కోసం పోటీ
టీజీ సిరీస్‌లో ‘9999’ ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి కారు యజమాని రూ. 25.5 లక్షలు చెల్లించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ అధికారులు తెలిపారు. దీనిపై హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్ స్పందించారు. ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఆన్‌లైన్ ద్వారా వేలం వేయడం సహజమని చెప్పారు. సోమవారం నిర్వహించిన వేలంలో ‘9999’ నెంబర్ అత్యధిక బిడ్ మొత్తానికి అమ్ముడబోయినట్లు చెప్పారు. కారు యజమాని తన హై-ఎండ్ వాహనం కోసం TG - 09 9999 నంబర్ ప్లేట్ కోసం రూ. 25,50,002 చెల్లించినట్లు వెల్లడించారు.
‘9999’ కోసం 11 మంది పోటీ
ఆన్‌లైన్‌లో సోమవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ వేలంలో ‘9999’ కోసం 11 మంది పోటీపడినట్లు జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్ చెప్పారు. అత్యధికంగా ఫాన్సీ నెంబర్ రూ. 25.5 లక్షలు పలికినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన వేలంలో ఒక ఫ్యాన్సీ నంబర్‌కు అత్యధిక బిడ్ మొత్తం ఇదేనని, తెలంగాణలో రికార్డు అని వెల్లడించారు. గత ఏడాది ఆగస్టులో నిర్వహించిన వేలంలో ‘9999’ నంబర్ 21.6 లక్షలు వసూలు చేసింది.
రూ.43 లక్షల ఆదాయం
సోమవారం నిర్వహించిన ఇతర ఫాన్సీ నంబర్ల వేలంలో ఖైరతాబాద్ రోడ్ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ (ఆర్టీఏ) కార్యాలయం రూ. 43 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. ఫ్యాన్సీ నంబర్స్ కావాలని ఎవరైనా ఆసక్తి చూపితే రూ.50,000 చెల్లించి దానిని రిజర్వ్ చేసుకోవచ్చని, ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ మంది బిడ్డర్లు ఉంటే బిడ్డింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన సంగతి తెలిసిందే.
సిరీస్ మార్చిన ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాహన రిజిస్ట్రేషన్ మార్క్‌లో మార్పు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్‌లో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. దీంతో కేంద్రం తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ సిరీస్‌ను టీఎస్ నుంచి టీజీకి మార్పు చేస్తూ మార్చి 12న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మోటారు వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 41(6) కింద ఉన్న అధికారాలతో గెజిట్ నోటిఫికేషన్‌లో మార్పు చేసినట్లు కేంద్ర రవాణా శాఖ తెలిపింది.
నోటిఫికేషన్‌లోని టేబుల్‌లో సీరియల్ నంబర్ 29ఏ కింద.. తెలంగాణ రాష్ట్రానికి ఇదివరకు ఉన్న టీఎస్ స్థానంలో ఇప్పుడు టీజీ మార్క్ కేటాయించినట్లు వెల్లడించింది. తెలంగాణలో ఇకపై రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీఎస్‌కు బదులు టీజీ రానుంది. ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసే వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. పాత వాటికి యథావిధిగా టీఎస్ కొనసాగుతుందని, కొత్తగా మార్చుకోవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.