Bandi Sanjay : ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా, నెక్ట్స్ తెలుగు రాష్ట్రాల్లోనే - బండి సంజయ్
Bandi Sanjay : ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ విజయంపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. మోదీ చేసిన అభివృద్ధిని చూసి ఈశాన్య రాష్ట్రాల ప్రజలు బీజేపీకి పట్టం కట్టారన్నారు.
Bandi Sanjay : ఈశాన్య రాష్ట్రాల లో బీజేపీ హవా కొనసాగుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. నాగాలాండ్ , త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందన్నారు. మేఘాలయలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధిని చూసి మోదీ ప్రభుత్వానికి పట్టం కట్టడం, జేపీ నడ్డా ఆధ్వర్యంలో బీజేపీని బల పర్చడం చాలా సంతోషంగా ఉందన్నారు. అయోధ్య నుండి ఆగర్తల వరకు నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందన్నారు. గతంలో కాషాయ జెండా పడితే దాడులు జరిగేవని, ఇవాళ కాషాయ జెండా దమ్ము చూపిందన్నారు. బీజేపీకి ఈశాన్య రాష్ట్రాలు అండగా నిలిచాయన్నారు.
పేదల రాజ్యం రాబోతుంది
"కమ్యూనిస్టుల పనిఅయిపోయింది. కాంగ్రెస్ పార్టీ గల్లీలో లేదు దిల్లీలో లేదు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పనిఅయిపోయింది. త్వరలో జరిగే తెలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరబోతుంది. బీజేపీని విమర్శించే ఇతర పార్టీలు బీఆర్ఎస్ ఈశాన్య ప్రాంతం నుంచి వీచే దగ దగ కాంతులకు మాడిపోతాయి. తెలంగాణలో రాబోయేది రామ రాజ్యం, పేదల రాజ్యం రాబోతోంది. పెద్దోళ్ల రాజ్యం నాశనం కాబోతోంది. తెలంగాణ ఏ లక్ష్యం కోసం ఏర్పాటు చేసుకున్నామో ఆ లక్ష్యం నెరవేరలి అంటే భాజపా ప్రభుత్వం రావాలి. భాజపా రాబోతుంది. ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తూ ఇంకా అభివృద్ధి పథకాలు ఏర్పాటు చేస్తాం. అప్పుల్లో ఉన్న తెలంగాణ కాపాడాలి అంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం భాజపా. రాబోయే కాలంలో తెలంగాణలో భాజపా గెలిస్తే దేశం మొత్తం సంబురాలు చేసుకుంటారు." - బండి సంజయ్
ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ హవా
త్రిపుర, నాగాలాండ్‌లో ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి హవా కొనసాగింది. మేఘాలయలో మాత్రం కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్రిపురలో బీజేపీ కూటమి 33 చోట్ల గెలుపుకి ఓ అడుగు దూరంలో ఉంది. నాగాలాండ్‌లోనే మేజిక్ ఫిగర్ 31 మార్క్‌ను దాటింది బీజేపీ కూటమి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే త్రిపురలో తిప్రా మోత పార్టీ నుంచి బీజేపీ కూటమికి గట్టి పోటీ ఎదురైంది. ఒంటరిగా బరిలోకి దిగిన ఈ పార్టీ ఏకంగా 12 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమి మాత్రం ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టుకోలేకపోయింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఈ సందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ భారీ విజయం సాధించిందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటికే త్రిపురలో బీజేపీ సంబరాలు మొదలయ్యాయి.
అగర్తలా లోని పార్టీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సందడి చేశారు కార్యకర్తలు. మాణిక్ సాహా విజయంతో మరోసారి ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాగాలాండ్‌లో BJP-NDPP కూటమి 33 చోట్ల విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్‌ను దక్కించుకుంది. నాగాలాండ్ చరిత్రలోనే తొలిసారి ఇద్దరు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో గెలిచిన మొదటి మహిళగా హెకానీ జఖాలు (Hekani Jakhalu) రికార్డు సృష్టించగా..ఆ తర్వాత కొద్దిసేపటికే సల్హౌతునొ క్రుసె (Salhoutuonuo Kruse) గెలుపొందారు. వీరిద్దరూ NDPP అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచారు.