Rahul Gandhi : టీఆర్ఎస్ తో భవిష్యత్ లోనూ పొత్తులుండవు, ప్రజల కోసం పనిచేసేవాళ్లకే సీట్లు : రాహుల్ గాంధీ
Rahul Gandhi : టీఆర్ఎస్ తో పొత్తులపై కాంగ్రెస్ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు రాహుల్ గాంధీ. టీపీసీసీ విస్తృత సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
Rahul Gandhi : టీఆర్ఎస్ తో భవిష్యత్ లో కూడా పొత్తులు ఉండవని ఏఐసీసీ కీలకనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ గాంధీభవన్ లో టీపీసీసీ ప్రత్యేక విస్తృత సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో పాటు 300 మంది ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. తెలంగాణ ప్రజలను మోసం చేసిన వారితో ఎలాంటి పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ నియంతృత్వ పాలన పోయి కాంగ్రెస్ ప్రజా పాలన రావాలని కోరారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. పని చేద్దాం, తప్పనిసరిగా ప్రతిఫలం ఉంటుందని రాహుల్ గాంధీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగ యువత 8 ఏళ్లుగా పడుతున్న ఇబ్బందులు చూస్తున్నామని, తెలంగాణ సంపదను కేసీఆర్ ఎలా దోపిడీ చేశారో చూస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి కేసీఆర్ ను తరిమే బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఇష్టానుసారం మాట్లాడితే ఉపేక్షించం
"విద్య, వైద్య, ఉపాధి రంగాలపై ఫోకస్ పెట్టాలి. వరంగల్ డిక్లరేషన్ అంశాలను 30 రోజుల్లోగా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లండి. 12 ఏళ్ల కుర్రాడికి కూడా వరంగల్ డిక్లరేషన్ అంశాలు అర్థం అయ్యేలా చెప్పండి. తెలంగాణ ప్రజల కలలను సాకారం చేయాలి. ప్రజల కోసం ఎవరైతే పని చేస్తారో వారికే టిక్కెట్లు ఇస్తాం. ముందే చెబుతున్నా తర్వాత ఎవరూ ఏమీ అనుకోవద్దు. క్షేత్ర స్థాయి సమాచారం ఆధారంగా సీట్లు కేటాయిస్తాం. ఏ సమస్య ఉన్నా నాలుగు గోడల మధ్యే మాట్లాడాలి. మీడియాతో మాట్లాడేవారు పార్టీకి నష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కుటుంబం లాంటిది, సమస్యలు ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందాం. ఇష్టానుసారం మాట్లాడితే ఉపేక్షించం " అని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
ఎక్కడికి రమ్మన్నా వస్తా
తెలంగాణలో మార్పు కోరుకునేవారు కాంగ్రెస్ లోకి రావాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. తనని ఎక్కడికి రమ్మన్న వస్తానని, తెలంగాణ కోసం పనిచేద్దామని రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ లో కూర్చుంటే సీట్లు రావన్నారు. దిల్లీకి అసలే రావొద్దని రాహుల్ గాంధీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వివాదాలు వీడి పార్టీ కోసం పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలకు రాహుల్ గాంధీ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : Rahul Gandhi : చంచల్ గూడ జైలుకి రాహుల్ గాంధీ, ఎన్‌ఎస్‌యూఐ నేతలతో ములాఖత్