Etela Rajender on KCR : చేతగాని వాని చేతిలో సీఎం పదవి ఎందుకు? - సీఎం కేసీఆర్ పై ఈటల ఘాటు వ్యాఖ్యలు
Etela Rajender on KCR : బస్సు, కరెంట్ ఛార్జీలు పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంపై ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే ఈటల ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలు సీఎం కేసీఆర్ అహంకారానికి పాతర వేశారని విమర్శించారు.
Etela Rajender on KCR : హుజూరాబాద్ లో బీజేపీ(BJP) కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etela Rajender) పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టెలా తీర్పు ఇచ్చినందుకు హుజూరాబాద్(Huzurabad) ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈటల రాజేందర్ అన్నారు. ఇటీవల ఎన్నికల్లో 1 లక్షా 7 వేల ఓట్లు సంపాదించుకుని సీఎం కేసీఆర్(CM KCR) అహంకారానికి పాతర వేశామన్నారు. దేశంలో ప్రజాస్వామిక విధానాన్ని కాపాడిన గడ్డ హుజూరాబాద్ అన్న ఆయన.. ప్రజలను నమ్ముకుంటే ఆశీర్వదిస్తారని మరోసారి నిరూపించారన్నారు. డబ్బుకు స్థానం లేదు అని రుజువు చేశారన్నారు. ఎన్ని డబ్బులు ఇస్తామన్నా లొంగకుండా పులిబిడ్డల్లా యువత పని చేశారని, కుట్రలు అన్నీ భగ్నం చేశారన్నారు. టీఆర్ఎస్ నేతలు బీజేపీ కార్యకర్తలను ఎన్నో ప్రలోభాలు పెట్టిన లొంగలేదన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అవహస్యం చేసిన సీఎం కేసీఆర్
"నన్ను గెలిపించి పంపించిన కూడా...ప్రజాభిప్రాయం చెల్లదు అని చెప్పి నన్ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు. రాజ్యాంగ బద్దంగా గెలిచిన నన్ను మాట్లాడకుండా చేసి కేసీఆర్ అహంకారం ప్రదర్శించారు. కోర్టు చెప్పినా కూడా తీసుకోకుండా స్పీకర్ ఛైర్ ఔన్నత్యాన్ని తగ్గించారు. కేసీఆర్ కి ఇంత అహంకారమా? అని ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పుడు బీజేపీ(BJP) ది మెట్లు ఎక్కే స్థాయి కాదు. 119 స్థానాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోతుంది బీజేపీ. హుజూరాబాద్ తో కసి తీరలేదు తెలంగాణ అంతటా టీఆర్ఎస్(TRS) ను బొంద పెట్టుడు ఖాయం. తెలంగాణ ఉద్యమాన్ని కాపాడింది కరీంనగర్ అయితే కరీంనగర్ కాపాడింది హుజూరాబాద్. రేపు తెలంగాణ అంతటా బీజేపీ జెండాను ఎగురవేస్తాం. " అని ఈటల రాజేందర్ అన్నారు.
టీఆర్ఎస్ ను రాష్ట్రమంతా ఓడించాలి
ఇరవై ఏళ్లుగా నియోజకవర్గ ప్రజల కళ్లలో మెదిలిన బిడ్డను తానని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఇకపై నియోజకవర్గంలో అందుబాటులో ఉండలేనన్నారు. టీఆర్ఎస్ ను రాష్ట్రమంతా ఓడించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనకు ప్రజల కోసం మిషన్ లా పని చేయడం తప్ప మరో పనిలేదన్నారు. తెలంగాణ ప్రజలందరినీ భారతీయ జనతా పార్టీ జెండా కిందకు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. ఎవరెవరు అయితే హుజూరాబాద్ వచ్చి పని చేశారో వారందరి భరతం పడతామని ఆ నియోజకవర్గాల ప్రజలు ఫోన్ చేస్తున్నారన్నారు. తాను కూడా వారి కోసం పని చేసి ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు ఈటల.
బస్సు, కరెంట్ ఛార్జీలు పెంచి ధర్నాలు
"కేంద్రం ప్రభుత్వం బియ్యం కొనం అని ఇప్పటివరకు చెప్పలేదు. బాయిల్డ్ రైస్(Boiled Rice) వద్దు అని మాత్రమే చెప్పింది. ఇన్ని రోజులు వడ్లు కొనడానికి డబ్బులు ఇచ్చింది కేంద్రం. కానీ ఈయన గొప్పగా చెప్పుకున్నారు. ఈసారి కూడా బియ్యం కొంటా అని చెప్తున్నా నాకు చేతకాదు అని కేసీఆర్ అంటున్నారు. చేతగాని వాని చేతిలో సీఎం పదవి ఎందుకు? చేతనైన వారి చేతికి ఇవ్వండి. బస్సు ఛార్జీలు, కరెంట్ ఛార్జీలు పెంచిన కేసీఆర్ ధరల పెంపుపై ధర్నాలు చేయిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం హయాంలోనే పెట్రోలు ధరలు(Petrol Rates) క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా పెంచుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది. దేశ వ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయి అని కేంద్రం టాక్స్ తగ్గించింది. ఆ మేరకు వివిధ రాష్ట్రాలు కూడా ధరలు తగ్గించాయి. కానీ తగ్గించని ఓకే ఒక రాష్ట్రం తెలంగాణ" అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు.