Huzurabad Etela : హుజూరాబాద్ వైపు చూడని బీజేపీ అగ్రనేతలు..! ఈటలది ఒంటరి పోరాటమేనా..?
యాత్రల సన్నాహాల్లో బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారు. హుజూరాబాద్‌లో ఈటల సొంత క్యాడర్‌తో ప్రచారం చేసుకుంటున్నారు.
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఆయనకు కొత్తగా బీజేపీ నేత అనే పేరు మాత్రమే వచ్చింది కానీ ఆ పార్టీ తెలంగాణ నేతల నుంచి అందుతున్న సహకారం మాత్రం ఏ మాత్రం లేదు. బీజేపీలో చేరిన మరుసటి రోజు నుంచి ఈటల రాజేందర్ హుజూరాబాద్‌లో కార్యచరణ ఖరారు చేసుకుని రంగంలోకి దిగారు. మధ్యలో మోకాలి ఆపరేషన్ జరిగినా .. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే హుజూరాబాద్ వెళ్లిపోయారు. అక్కడ ఆయన అనుచరులతోనే వ్యవహారాలు చక్క బెట్టుకుంటున్నారు. స్థానికంగా బీజేపీకి ఎలాంటి క్యాడర్ లేదు. ఉన్నారని చెప్పుకున్న ఒకరిద్దరు లీడర్లు టీఆర్ఎస్‌లో చేరిపోవడమో... సైలెంట్‌గా ఉండటమో చేస్తున్నారు.
యాత్రల సన్నాహాల్లో బండి సంజయ్, కిషన్ రెడ్డి..!
అదే సమయంలో బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరూ ఈటల రాజేందర్ కోసం పని చేయడం లేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నెలాఖరు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక తెలంగాణ బీజేపీకి హైకమాండ్ వద్ద పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంత వరకూ ఈటల రాజేందర్ గురించి కానీ.. హుజూరాబాద్ ఉపఎన్నిక గురించి కానీ ఆలోచించినట్లుగా లేదు. ఆయన పార్టీ హైకమాండ్ నిర్దేశించిన విధంగా జన ఆశీర్వాద్ యాత్ర చేపడుతున్నారు.
హుజూరాబాద్‌లో ఒంటరిగా ఈటల పోరాటం..!
ఆయనకు రెండు, మూడు రాష్ట్రాల బాధ్యతలు ఉన్నాయి. దీంతో ఆయన కూడా హుజూరాబాద్‌పై దృష్టి పెట్టలేరు. ముఖ్య నేతలంతా సైడైపోవడంతో ఇప్పటికే బీజేపీ తరపున ఇంచార్జ్‌లుగా నియమించిన కొంత మంది నేతలు కూడా తమకెందుకు భారం అని లైట్ తీసుకుంటున్నారు. చాలా మంది సోషల్ మీడియా ప్రచారారాలకే పరిమితమవుతున్నారు. ఇవన్నీ ఈటల రాజేందర్ వర్గీయుల్ని నిరాశ పరుస్తున్నాయి. హుజూరాబాద్ ఉపఎన్నిక బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. ఈటల లాంటి నేతలు పార్టీ తరపున నిలబెట్టి గెలిపుంచుకోకపోతే... ప్రత్యామ్నాయం అన్న ధీమాకు గండి పడుతుంది. కానీ తెలంగాణ బీజేపీ నేతల్లో ఉన్న వర్గ పోరాటం.. ఇతర విబేధాల వల్ల ... అనుకున్నట్లుగా హుజూరాబాద్‌లో పోరాటం చేయలేకపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
షెడ్యూల్ వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందని ఈటల వర్గీయుల ఆశ..!
సాధారణంగా ఉపఎన్నిక అంటే.. బీజేపీ కేంద్ర కార్యాలయం నుంచి ఫాలో అప్ ఉంటుంది. హుజూరాబాద్ విషయంలో అదీకూడా లేదు. అయితే ఒక్క సారి ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత పరిస్థితి మారుతుందని.. బీజేపీ హైకమాండ్ కేంద్రమత్రుల్ని సైతం ప్రచారానికి పంపుతుందని ఈటల వర్గీయులు భావిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలను కూడా.. హైకమాండ్ ట్యూన్ చేస్తుందని అందరూ కలిసి ఈటల విజయం కోసం పని చేస్తారన్న నమ్మకంతో ఆయన వర్గీయులు ఉన్నారు. కానీ ఇప్పటికైతే మాత్రం ఈటల ఒంటరి అనే భావన బీజేపీలోనే పెరిగిపోతోంది.