Telangana Highcourt: అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి భూకేటాయింపులు రద్దు - టీజీ హైకోర్టు కీలక తీర్పు
IAMC: అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రానికి గతంలో కేటాయించిన భూమిని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అది ప్రైవేటు సంస్థ అని భూమి ఉచితంగా ఇవ్వడం సుప్రీంకోర్టు రూల్స్ ను ఉల్లంఘించడమేనన్నారు.

IAMC Lands Cancel: తెలంగాణ హైకోర్టు హైదరాబాద్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (IAMC)కు రాయిదుర్గంలో 3.5 ఎకరాల భూమి కేటాయింపును రద్దు చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-2022లో హైదరాబాద్‌లోని రాయిదుర్గం (IT కారిడార్, IKEA పక్కన)లో 3.5 ఎకరాల భూమిని IAMCకు ఉచితంగా కేటాయించింది. ఈ భూమి సుమారు 350 కోట్ల రూపాయల విలువైనదిగా అంచనా వేశారు.
2022 మార్చి 12న, అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ IAMC శాశ్వత భవనానికి శంకుస్థాపన చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ సంస్థకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ భూమి కేటాయింపును సవాలు చేస్తూ 2023లో PILలు దాఖలయ్యాయి.
IAMCని అంతర్జాతీయ కంపెనీల మధ్య వివాదాలను పరిష్కరించే వేదికగా స్థాపించారు. వ్యాపార , సంస్థాగత ఆర్బిట్రేషన్‌ను ప్రోత్సహించడం దీని ఉద్దేశం. ఈ సెంటర్‌కు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి , రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ట్రస్టీలుగా ఉంటారు. రాష్ట్ర ప్ర భుత్వం IAMC నిర్వహణ కోసం ఏటా 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా కేటాయించింది. అడ్వకేట్ కె. రఘునాథ రావు , ఇతరులు ఈ భూమి కేటాయింపును సవాలు చేస్తూ రెండు PILలు దాఖలు చేశారు. భూములు, ఆర్థిక సాయం చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. IAMCని ఒక ప్రైవేట్ సంస్థగా పరిగణిస్తారని రాష్ట్ర ప్రభుత్వం IAMCకు ఆర్థిక సహాయం అందించడం మరియు ప్రభుత్వ శాఖలు, పబ్లిక్ సెక్టర్ సంస్థలకు IAMCని ఆర్బిట్రేషన్ వేదికగా ఉపయోగించాలని ఆదేశించడం కూడా చట్టవిరుద్ధమని వాదించారు.
అయితే అడ్వకేట్ జనరల్ ఎ. సుదర్శన్ రెడ్డి IAMC స్థాపన అంతర్జాతీయ వ్యాపార వివాదాలను పరిష్కరించడానికి, హైదరాబాద్‌ను ఆర్బిట్రేషన్ హబ్‌గా మార్చడానికి అవసరమని వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న తరవాత ఈ కేటాయింపు సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించిందని, రాష్ట్రం ప్రైవేట్ సంస్థలకు ఉచిత భూమిని కేటాయించకూడదని హైకోర్టు నిర్ధారించింది. జస్టిస్ కె. లక్ష్మణ్, జస్టిస్ కె. సుజన బెంచ్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం హైకోర్టులో 50 చదరపు అడుగుల స్థలంలో పనిచేస్తుందని గుర్తు చేసింది. ఈ తీర్పు IAMC హైదరాబాద్‌లో శాశ్వత భవన నిర్మాణ ప్రణాళికలను ఆపేసినట్లు అవుతుంది.





















