Rains In AP Telangana: నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు - ఏపీ, తెలంగాణలకు ఐఎండీ ఎల్లో అలర్ట్
Weather Updates: ఏపీ, తెలంగాణలో మరో 4 రోజులు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. తెలంగాణలో సోమవారం కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవగా, ఏపీలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురిసిందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణం వైపు నుంచి గాలులు వీస్తున్నాయి. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమొరిన్ ప్రాంతం, మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక లోపల 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఏపీ, తెలంగాణలో మరో 4 రోజులు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో మరో 4 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.
నేడు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ వార్నింగ్ జారీ చేశారు. సెప్టెంబర్ 10 వరకు వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీలుగా నమోదైంది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడితే, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష సూచన ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
కోస్తాంధ్రలో విస్తారంగా భారీ వర్షాలు పడతాయి. కొన్ని చోట్లలో ఎండ కాస్తున్నా కూడా పార్వతీపురం మణ్యం, శ్రీకాకుళం (పశ్చిమ భాగాలు), విజయనగరం, అనకాపల్లి జిల్లాలోని పలు భాగాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. చాలా కాలం తర్వాత రాజమండ్రి, కాకినాడ నగరాలతో పాటుగా తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాలోని చాలా భాగాల్లో వర్షాలు కురవనున్నాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్నిచోట్ల వర్షాలు లేక, పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో అన్నదాతలు వర్షాల కోసం చూస్తున్నారు.
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు, చిత్తూరు జిల్లాలోకి విస్తరించాయి. ఆ తర్వాత అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలతో పాటు కడప జిల్లా పశ్చిమ ప్రాంతాలు, కర్నూలు, నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. పల్నాడు జిల్లా, తిరుపతి జిల్లా పశ్చిమ భాగాల్లో అక్కడక్కడ వర్ష సూచన ఉంది.