Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - గోదారమ్మ ఉగ్ర రూపం, ప్రమాద హెచ్చరికలు జారీ
Weather Report: అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. అటు, వానలతో గోదావరి వరద పోటెత్తుతోంది.
Heavy Rains In AP And Telangana: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఒడిశా, ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోన్న అల్పపీడనం సోమవారం బలహీనపడి తూర్పు మధ్యప్రదేశ్, పరిసర ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీనికి అనుబంధ ఆవర్తనం సగటున సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి, ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఆగ్నేయం వైపు వంగి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న 3 రోజులు కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం నుంచి 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కాగా, కామారెడ్డి, సంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ములుగు జిల్లా మల్లంపల్లిలో 125.3 మి.మీ, ఏటూరునాగారం 121.5 మి.మీల వర్షపాతం నమోదైంది.
ఏపీలోనూ..
అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే రెండు రోజుల్లో గంటకు 30 - 40 కి.మీల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
గోదారమ్మ ఉగ్రరూపం
అటు, భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం రాత్రి గోదావరి నీటిమట్టం 44 అడుగులు దాటగా మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. సోమవారం మధ్యాహ్నానికి 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది.
మరోవైపు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం సోమవారం ఉదయం 103.550 మీటర్లుగా నమోదు కాగా.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో నది ఒడ్డున ఉన్న లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. కుంట్లం, పాల్గుల, అన్నారం, చండ్రుపల్లి, మద్దులపల్లి, నాగేపల్లి, కాళేశ్వరం, మెట్పల్లి, పుస్కుపల్లి, బీరసాగర్, పెద్దంపేట గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ధవళేశ్వరం వద్ద గోదారి ఉద్ధృతి
మరోవైపు, ధవళేశ్వరం వద్ద గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో ఔట్ ఫ్లో 11.36 లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సోమవారం రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ప్రవాహాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర సహాయక చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ - 1070,112,18004250101 నెంబర్లు సంప్రదించాలని సూచించారు.