Rains In AP Telangana: మరో రెండు రోజులు కుండపోత - ఏపీ, తెలంగాణలకు ఐఎండీ రెయిన్ అలర్ట్
Rains In Andhra Pradesh: మరో రెండు నుంచి మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
Rains in Telangana AP: తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం సూచన ప్రకారం.. మరో రెండు నుంచి మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరానికి చేరుకుని తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 13 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. భారీ వర్ష సూచనతో పలు జిల్లాలకు నేడు సైతం ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. నిన్న (సెప్టెంబర్ 10న) పలు జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి.
నేడు సెప్టెంబర్ 11న భారీ వర్ష సూచనతో ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. హైదరాబాద్ లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ కేంద్రం అధికారులు. ఉత్తర, పశ్చిమ దిశల నుంచి గంటకు 8 నుంచి 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2022
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో విస్తారంగా వర్షాలు పడతాయి. మిగతా చోట్ల చల్లని గాలులు వేగంగా వీస్తాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉన్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది అమరావతి వాతావరణ కేంద్రం. తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరించారు.
District forecast and warnings for Andhra Pradesh dated 10.09.2022 pic.twitter.com/hbW0rHkVqQ
— MC Amaravati (@AmaravatiMc) September 10, 2022
దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
నేడు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కొన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొర్లిపోతుంటే రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్ష సూచనతో గుంటూరు, ప్రకాశం క్రిష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
హెచ్చరిక: భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు హెచ్చరించారు. అరటితోటలకు నష్టం వాటిల్లుతుంది. కోతకు సిద్ధంగా ఉన్న పంటలకు నష్టం జరుగుతుందన్నారు. వర్షపు నీళ్లు నిలిచిపోయే చోట ఉండకూడదు. వైర్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అరటి తోటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. చెట్ల కింద నిల్చోకుండా సురక్షిత మైన చోట ఉండాలని ప్రజలను హెచ్చరించారు.