(Source: ECI/ABP News/ABP Majha)
Telangana Assembly Harish Rao : పదే పదే అగ్గిపెట్టే ముచ్చట - అసెంబ్లీలో కాంగ్రెస్‌పై హరీష్ రావు ఆగ్రహం !
Harish Rao : అసెంబ్లీలో పదే పదే అగ్గిపెట్టే ప్రస్తావన తీసుకు రావడంపై హరీష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Harish Rao : అసెంబ్లీలో కాంగ్రెస్ నేతల ప్రసంగాలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ ఏదైనా మాట్లాడితే.. అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారు. అది సరికాదని హరీశ్‌రావు అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఏదన్నా మాట్లాడితే.. అగ్గిపెట్టె ముచ్చట తీసుకువస్తారు సీఎం. నాడు అమరవీరులకు కాంగ్రెస్ నాయకులు శ్రద్ధాంజలి ఘటించలేదు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించలేదు. కాంగ్రెసోళ్లు అమరవీరుల పాడే మోసినోళ్లు కాదు. తుపాకులతో ఉద్యమకారులను బెదిరించిన మీకు తెలంగాణ పోరాటం, అమరవీరులకు గురించి తెలుస్తదని అనుకోను. ఇక అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లాగా ఈ అగ్గిపెట్టె ముచ్చట మాట్లాడటం బంద్ చేయండి. తమను కించపరిచి, రాజకీయంగా విమర్శిస్తాం అనుకుంటే.. అది మీ రాజకీయ విజ్ఞతకే వదిలేస్తున్నాను అని హరీశ్‌రావు అన్నారు.
ఎస్ఎల్‌బీసీ విషయంలో సభను తప్పుదోవ పట్టించారు సీఎం రేవంత్ రెడ్డి. పదేండ్లలో కిలోమీటర్ తవ్వారు అని మొన్న ప్రెస్‌మీట్‌లో రేవంత్ చెప్పారు. ఈ పదేండ్లలో కిలోమీటరున్నర తవ్వారు అని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 11 కిలోమీటర్లు తవ్వినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు. దీన్ని సీఎం కరెక్షన్ చేసుకోవాలి. ఇంకోసారి మాట్లాడేప్పుడు అవగాహనతో మాట్లాడాలని రేవంత్‌కు హరీశ్‌రావు సూచించారు.
నాగార్జున సాగర్ విషయంలో కూడా సీఎం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హరీశ్‌రావు పేర్కొన్నారు. శ్రీశైలం ఏపీ ప్రభుత్వం కంట్రోల్‌లో, నాగార్జున సాగర్‌ను తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్‌లో ఇచ్చారు. ఎన్నికలు జరిగే సమయంలో సాగర్‌ను ఏపీ కంట్రోల్‌లోకి తీసుకుంది. రెండు నెలలు గడుస్తున్నప్పటికీ సీఆర్పీఎఫ్ భద్రతలో సాగర్ ఉంది. శ్రీశైలం కూడా ఏపీ హయాంలో ఉంది. సాగర్‌ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకునేందుకు కృషి చేయాలి. దీనికోసం సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
రాష్ట్రాభివృద్ధికోసం బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా సహకరిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సభలో గొంతు చించుకున్నా మైక్ ఇవ్వలేదని హరీష్రావు ఆరోపించారు. ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పగా.. జనవరి నెల జీతాలు ఫిబ్రవరి లో ఇచ్చారని హరీష్ రావు విమర్శించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఇంకా దారుణం అన్నారు. పీవీ కి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందే బీఆర్ ఎస్ అని హరీష్ రావు చెప్పారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదని అన్నారు హరీష్ రావు.