Harish Rao: తులం బంగారం ఇస్తే కాంగ్రెస్‌కు ఓటేయండి, లేకపోతే బీఆర్ఎస్‌కే మీ ఓటు: హరీష్ రావు
Telangana Dubbaka Constituency: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలకు హ్యాండ్ ఇచ్చిందని, హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు.
BRS Medak Parliamentary Meeting at Doulthabad: దౌల్తాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరితే హస్తం పార్టీకే ఓటు వేయాలని, ఆ హామీలు నెరవేరని వాళ్లు బీఆర్ఎస్ కు ఓటు వేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. దౌల్తాబాద్ లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఎన్నికలకు ముందు చెప్పిన హామీలు.. రైతులు రూ.2 లక్షల రుణం తీసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, డిసెంబర్ 9న అన్నదాతల రుణాలు మాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల క్లిప్ ను సభలో ప్రదర్శించారు. నిరుద్యోగులకు రూ.4 భృతి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తూచ్ అంటుందని సెటైర్లు వేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉద్యోగాలని చెప్పామని, వారికి నగదు ఇస్తామని చెప్పలేదన్న వీడియోను సైతం ప్రదర్శించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే పార్లమెంట్ లో తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడతారని హరీష్ రావు పేర్కొన్నారు.
‘అక్కాచెల్లెమ్మలకు రూ.2,500 ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. మహాలక్ష్మీ పథకం ద్వారా అర్హులైన వారికి ప్రతినెలా నగదు ఇచ్చి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు తూట్లు పొడిచింది. రైతులకు రైతు బంధు నగదు రాలేదు. రైతు కార్మికులకు ఇస్తామన్న ఆర్థిక సాయంపై కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకోలేదు. కేసీఆర్ పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫేకులు, లీకులతో కాలయాపన చేస్తోంది. రైతులు, మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాల వారి కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ ప్రస్థానం తెలుసుకోవాలి. 10 ఏళ్ల కేసీఆర్, బీఆర్ఎస్ పాలన గురించి తెలుసుకుని ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం ఫేక్ వార్తలతో ప్రజల్ని మభ్యపెడుతోంది. వాటిని తిప్పికొట్టే బాధ్యత యువతపై అధికంగా ఉంది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదు. పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచారు. 400 సిలిండర్ ధరను రూ.1000 కి బీజేపీ నేతలు పెంచారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి 700 మందిని కేంద్రం పొట్టన పెట్టుకుంది. ఎన్నికలు దగ్గర పడుతన్న కొద్దీ ఎన్డీఏ సర్కార్ ధరల్ని తగ్గించినట్లు ప్రకటనలు చేసి ప్రజల్ని మభ్యపెడుతోంది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్ని బీజేపీ సర్కార్.. కేవలం 6, 7 లక్షల జాబ్స్ మాత్రమే. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోతే ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు అబద్ధాలు చెప్పి గెలిచారు. నిజాలు తెలుసుకున్న ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్ రావుకు బుద్ధి చెప్పి బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకున్నారు. ఇప్పుడు రఘునందన్ రావు మెదక్ బీజేపీ అభ్యర్థిగా వస్తున్నారు. మరోసారి బీజేపీకి బుద్ధి చెబుతూ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపించుకుందాం.
షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకాలలో ఇప్పటికి రూ.1 లక్ష వస్తోంది, వచ్చే నెల నుంచి రూ.1 లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్న రేవంత్ మాటలు ఏమయ్యాయి. కాంగ్రెస్ గెలిచాక బంగారం ధర భారీగా పెరిగింది. తులం బంగారం పక్కనపెడితే బీఆర్ఎస్ ఇచ్చిన రూ.1 లక్ష చెక్కులు కూడా లబ్ధిదారులకు అందడం లేదు. కేసీఆర్ కిట్ సైతం హాస్పిటల్స్ లో ఇవ్వడం లేదు. నాలుగు నెలల్లోనే ఇంత దారుణమైన మార్పు వచ్చింది. కొత్తవి ఇవ్వకపోగా, ఉన్న పథకాలు రద్దయ్యాయి. కాలువలకు నీళ్లు వదలడం లేదు. అక్కాచెల్లెమ్మలకు నగదు ఇవ్వలేదు. యువకులు, విద్యార్థులు బీఆర్ఎస్ చేసిన మేలుతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తే చాలని’ హరీష్ రావు సూచించారు.