YS Sharmila : కమీషన్ల కాళేశ్వరం కట్టారు, కాళోజీ కళాక్షేత్రం కట్టలేకపోయారు- వైఎస్ షర్మిల
YS Sharmila : వరంగల్ పై కేసీఆర్ ప్రేమ లేదని వైఎస్ షర్మిల విమర్శించారు. వరంగల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయాలేదన్నారు.
YS Sharmila : వరంగల్ పై సీఎం కేసీఆర్ కు ప్రేమ లేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. హన్మకొండ పెట్రోల్ పంప్ వద్ద వైఎస్ఆర్టీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో మాట్లాడిన వైఎస్ షర్మిల... బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి ఎన్నో పిట్ట కథలు చెప్పి పోతుంటారన్నారు. వరంగల్ కార్పొరేషన్ కు స్థానిక ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వరంగల్ నగరాన్ని డల్లాస్ చేస్తా అని చెప్పారని, కానీ ఆ హామీ విస్మరించారన్నారు. వరంగల్ ను హైదరాబాద్ తర్వాత IT హబ్ చేస్తా అని హామీ ఇచ్చారని, వేలమందికి ఉద్యోగాలు ఇస్తానని మోసం చేశారని ఆరోపించారు. ఐటీ కంపెనీలు వచ్చింది లేదు.. ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. IT కంపెనీలు రావాలి అంటే ఇక్కడ విమానాలు దిగాలన్నారని, నిరుపయోగంగా ఉన్న మమునూర్ ఎయిర్ పోర్టులో విమానాలు దింపుతా అని, అక్కడ విమానాలు దింపిందిలేదన్నారు.
వరంగల్ కు మెట్రో రైలు ఎప్పుడు
"వరంగల్ కు పెద్ద పెద్ద పరిశ్రమలు తెస్తా అన్నారు. వరంగల్ నుంచి హైదరాబాద్ కు ఇండస్ట్రీయల్ కారిడార్ అన్నారు. ఒక్క పరిశ్రమ రాలేదు. అజంజాహి మిల్స్ మూతపడితే...ఆ మిల్స్ ను తేరిపించడం కాదు. తలదన్నేలా TEXTILE PARK అన్నారు. 12 వందల ఎకరాలు భూసేకరణ అని చెప్పి కబ్జాలు చేశారు తప్పితే.. ఆ పార్క్ లో ఒక్క కంపెనీ అయినా వచ్చిందా? TEXTILE PARK కోసం భూములు ఇవ్వమని ప్రజలు ఆందోళన చేస్తున్నా..మీ ఎమ్మెల్యేలు రౌడీ ఇజం చేసి గుంజుకుంటున్నారు. వరంగల్ కు మెట్రో రైల్ అన్నారు. కాజీపేట నుంచి వరంగల్ వరకు మెట్రో ఏర్పాటు అన్నారు. 13 వందల కోట్లు కేటాయింపు అన్నారు. ఎక్కడ ఉంది మెట్రో రైల్ ? ఇటీవల వరదలకు వరంగల్ లో చాలా ప్రాంతాలు మునిగిపోతే... తక్షణం సైడ్ వాల్స్ నిర్మాణం అని చెప్పారు. ఒక్క కాలువకి నిర్మాణం జరగలేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేయిస్తా అని చెప్పి మోసం చేశారు. ఇదే వరంగల్ వేదికగా జర్నలిస్ట్ లకు చేసిన మోసం అంతా ఇంతా కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద జర్నలిస్ట్ కాలని అన్నారు. జర్నలిస్టులకు ఒక్క ఇళ్లు ఇచ్చిన పాపాన పోలేదు." - వైఎస్ షర్మిల
కాలోజీకి కళాక్షేత్రం ఏమైంది?
మాయ మాటల కేసీఆర్ చివరికి ఆ మహాకవి కాలోజీకి సైతం గౌరవం ఇవ్వలేదని వైఎస్ షర్మిల ఆరోపించారు. కాలోజీ పేరుమీద కళాక్షేత్రం నిర్మిస్తామని 2014 సెప్టెంబర్ 9న ప్రకటించారని, కమీషన్ల కాళేశ్వరం కడతారు.. కానీ కాళోజీ కళాక్షేత్రం కట్టలేకపోయారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో కనీసం ఒక్క ఎకరాకు సాగు నీరు అందించలేదన్నారు. ఎన్నికలు ఉంటేనే దొర బయటకు అడుగుపెడతారన్నారు. బంగారు తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే అన్నారు. కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉంటే..రాష్ట్రంలో ఉద్యోగాలు లేక వందల మంది నిరుద్యోగులు చనిపోయారన్నారు. 9 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క పథకం కూడా అమలు కాలేదన్నారు. పథకాల పేరు చెప్పి కేసీఆర్ చేసింది మోసమేన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో రూ.860 కోట్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కేసీఅర్ పాలన పోవాలి... వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలను మళ్ళీ అద్భుతంగా అమలు చేస్తామని షర్మిల హామీ ఇచ్చారు.