Gadwal MLA: ప్రభుత్వాధికారి కాలర్ పట్టి తోసేసిన ఎమ్మెల్యే, ఆగ్రహంతో బూతు కూడా - వీడియో
ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్కూల్ ని ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఆయన సమయానికి రాకపోవడంతో జడ్పీ ఛైర్ పర్సన్ సరితతో ఆ పాఠశాలను ప్రారంభం చేయించారు.
Jogulamba Gadwal News: జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారి పట్ల ప్రవర్తించిన తీరు వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్యే ఏకంగా అధికారి కాలర్ పట్టుకొని వెనక్కి తోసేశారు. అప్పుడే ఓ బూతు కూడా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూల్ ప్రారంభ కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన జరిగింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తనతో కాకుండా జడ్పీ ఛైర్మన్‌తో ఆ స్కూలును ప్రారంభం చేయించడం ఈ ఘటనకు కారణం అయింది. ఎమ్మెల్యే రావడం ఆలస్యం అయిందని నిర్వహకులు జడ్పీ ఛైర్మన్ తో స్కూలు ప్రారంభం కానిచ్చేశారు.
అసలేం జరిగిందంటే..
గద్వాలలో బీసీ గురుకుల పాఠశాలను నేడు (నవంబరు 22) ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy) ప్రారంభించాల్సి ఉంది. అయితే, ఆయన సమయానికి రాకపోవడంతో జడ్పీ ఛైర్ పర్సన్ సరితతో ఆ పాఠశాలను ప్రారంభం చేయించారు. కార్యక్రమం అనంతరం అక్కడికి వచ్చిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (MLA Krishna Mohan Reddy) అవాక్కయ్యారు. ఆయన ఆగ్రహానికి గురై ఇదేంటని ప్రశ్నించారు. కార్యక్రమం ఎప్పుడు ప్రారంభం అవుతుందని తాను ఫోన్లు చేస్తూనే ఉన్నానని, ఇంకో అర్ధగంటలో రండి అంటూ మీరే నన్ను ఆలస్యం అయ్యేలా చేశారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఆగ్రహం పట్టలేకపోయిన ఎమ్మెల్యే వెనకే ఉన్న విద్యాశాఖ అధికారి కాలర్ పట్టుకుని వెనక్కి తోసేశారు.
జోగులంబ గద్వాల జిల్లా.
— Time Today (@TimeTodaydaily) November 22, 2022
జిల్లా స్థాయి అధికారి గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణామోహన్ రెడ్డి.
Visit https://t.co/iFHuOMW0X9 to read more#timetodaynews #jogulambagadwal#jogulamba #gadwal #MLA #KrishnaMohanReddy #Bandlakrishnamohanreddy #BKMR #Telangana #TRSMLA #TRS #TRSParty pic.twitter.com/DZxoNEWnk3
ఎప్పటినుంచో ఇద్దరి మధ్యా విభేదాలు?
అయితే కొంతకాలంగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి (Bandla Krishna Mohan Reddy), జడ్పీ ఛైర్ పర్సన్ సరిత మధ్య రాజకీయ పరంగా కొన్ని విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ విభేదాల కారణంగానే తనతో కాకుండా జడ్పీ ఛైర్ పర్సన్ తో స్కూలు ప్రారంభం చేయించినందుకు ఆయనకు కోపం వచ్చినట్లు తెలుస్తోంది. అదంతా ఉద్దేశపూర్వకంగానే జరిగినట్లుగా ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. మరోవైపు, అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలతో తమను టార్గెట్ చేయడం ఏంటని అధికారులు వాపోతున్నారు.
అలంపూర్ నియోజకవర్గం, మానవపాడు మండలం జడ్పీటీసీగా సరిత ఎన్నికయ్యారు. జడ్పీ ఛైర్మన్ పదవి తన వర్గం వారికే ఇప్పించాలని ఎమ్మెల్యే ముందు నుంచి అనుకున్నారు. అయితే, హైకమాండ్ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేకుండా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలతో, సరితకు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పదవి వరించడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అసహనంతో ఉన్నారు. అదే వీరి మధ్య విభేదాలకు కారణమైనట్లు తెలుస్తోంది. తన వర్గీయులనే జడ్పీ పీఠంపై కూర్చోబెట్టాలని చివరి వరకూ ప్రయత్నించినా ఫలించలేదని స్థానిక నేతలు చెబుతున్నారు.
గద్వాల ప్రాంతంలో డీఆర్డీఏ పీడీగా పని చేస్తున్న జ్యోతి అనే మహిళను జడ్పీ సీఈఓగా నియమించాలని ఎమ్మెల్యే చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇది కూడా కుదరలేదు. దీంతో అసహనం చెందిన ఎమ్మెల్యే బండ్ల గతంలో తనకు గన్‌మెన్లు వద్దని మొండికేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రతిపాదించిన జ్యోతినే జడ్పీ సీఈఓగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిణామాలే జడ్పీ ఛైర్ పర్సన్ కు ఎమ్మెల్యేకు మధ్య విభేదాలు పెంచాయని స్థానికులు చెబుతున్నారు.