Guvvala Balaraju resigns: బీఆర్ఎస్‌లో రాజీనామాల పర్వం - మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గుడ్ బై
BRS: బీఆర్ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు.

Former MLA Guvvala Balaraju resigns from BRS: వరుసగా వివాదాలు చుట్టుముడుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీకి నేతలు రాజీనామాలు సమర్పిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు. ప్రస్తుతం బాలరాజు నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. దేశం కోసం పాటుపడే పార్టీలో చేరుతానని.. త్వరలో తన కార్యాచరణ ప్రకటిస్తానని గువ్వల బాలరాజు చెబుతున్నారు.
గువ్వల బాలరాజు తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరి అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయ కార్యకలాపాలు చేపట్టారు. ఆయన పార్టీలో క్రియాశీల సభ్యుడిగా గుర్తింపు పొందారు. 2014లో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్‌పై మళ్లీ అచ్చంపేట నుండి పోటీ చేసి, కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై 9,441 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా అచ్చంపేట నుండి పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు.
2022 జనవరి 26న గువ్వల బాలరాజు నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ప్రభుత్వ విప్‌గా కూడా వ్యవహరించారు. 2024లో బీఆర్ఎస్ నుండి ఎంపీ టికెట్ ఆశించిన బాలరాజుకు అది దక్కకపోవడంతో అసంతృప్తికి గురయ్యారు. "KCR తర్వాత నేనే" అన్నట్లు గొప్పలు చెప్పుకున్నారని, కానీ టికెట్ దక్కకపోవడంతో ఆయన బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని సమయం కోసం ఎదురు చూస్తున్నారని అనుచరులు చెబుతున్నారు.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఎపిసోడ్ లో గువ్వల బాలరాజు కూడా ఒకరు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణల సందర్భంలో బాలరాజు పేరు కూడా చర్చలోకి వచ్చింది. నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరు బాలరాజు. ఈ ఘటనలో ఆయన తనను తాను "KCR వదిలిన బాణం"గా ప్రచారం చేసుకున్నారు. గువ్వల బాలరాజు 2014 నుండి 2023 వరకు అచ్చంపేట ఎమ్మెల్యేగా, నాగర్‌కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా మరియు ప్రభుత్వ విప్‌గా కీలక పాత్ర పోషించారు. అయితే, 2023 ఎన్నికల్లో ఓటమి, స్థానికుల అసంతృప్తి, దాడులు, ఎంపీ టికెట్ దక్కకపోవడం వంటి సంఘటనలు ఆయన రాజకీయ జీవితంలో సవాళ్లుగా నిలిచాయి. 2024 అక్టోబర్ నుండి నియోజకవర్గ రాజకీయాల నుండి దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పారు.
బాలరాజుతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా.. బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీరంతా భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మెరుగుపడలేదని.. తమ రాజకీయ భవిష్యత్ కోసం ఇతర పార్టీల్లో చేరడం మంచిదని కొంత మంది భావిస్తున్నారు. అదే సమయంలో బీజేపీ కూడా.. తమకు నాయకత్వ సమస్యలు ఉన్న చోట్ల బీఆర్ఎస్ నేతల్ని చేర్చుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.





















