Giridhar Gamang BRS : బీఆర్ఎస్‌లో చేరనున్న ఒడిషా మాజీ సీఎం - ఫిబ్రవరి ఐదున మహారాష్ట్రలో బహిరంగసభ !
ఒడిషా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బీజేపీకి రాజీనామా చేశారు.
Giridhar Gamang BRS : ఒడిశా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు గిరిధర్ పంపారు. కాగా ఇటీవల హైదరాబాద్ వచ్చిన గిరిధర్ గమాంగ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు , మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ త్వరలోనే భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారు. గిరిధర్ గమాంగ్ 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గిరిధర్ గమాంగ్ ప్రకటించారు. ఆయన కుమారుడు శిశిర్ గమాంగ్ కూడా బీజేపీకి రాజీనామా చేశారు.ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గిరిధర్ గమాంగ్ తన కుమారుడితో కేసీఆర్‌ను కలిశారు.
తొమ్మిది సార్లు పార్లమెంట్ సభ్యునిగా గెలిచిన గమాంగ్ - పది నెలల పాటు ఒడిషా సీఎంగా బాధ్యతలు
గిరిధర్ గమాంగ్ రాకాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంబించి సొంతరాష్ట్రం నుంచి 9 సార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 దాకా వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 ఫిబ్రవరి 17 నుంచి డిసెంబర్ 6 వరకు సుమారు 10 నెలలపాటు ఒడిశా ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2015 వరకు కాంగ్రెస్ పార్టీలో కీలకనేతగా ఉన్నాయన ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు.
ఫిబ్రవరి ఐదో తేదీన నాందెడ్‌లో బీఆర్ఎస్ బహిరంగసభ
మరో వైపు మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఫిబ్రవరి 5న బీఆర్‌ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సభకు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్ల కోసం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు బీఆర్‌ఎస్ సీనియర్ నేత బాలమల్లును ఇన్‌చార్జిలుగా నియమించారు. కేసీఆర్ మూడు రోజులుగా ఈ జిల్లాల ఎమ్మెల్యేలు, నేతలతో ప్రత్యేకంగా సమావేశమై సభను విజయవంతం చేసేందుకు, ఏర్పాట్లపైనా దిశానిర్దేశం చేశారు. మంగళవారం జోగు రామ న్న నేతృత్వంలో బాల్క సుమన్, జీవన్‌రెడ్డి తదితర నేతలు నాందేడ్ జిల్లాలో పర్యటించి సభను నిర్వహించే స్థలాన్ని అక్కడి నాయకులతో కలిసి పరిశీలించారు. బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన తర్వాత తొలి సారి మహారాష్ట్రలో బహిరంగసభ నిర్వహిస్తుండడంతో కేసీఆర్ మం త్రులతో పాటు నాందేడ్‌జిల్లా సరిహద్దులో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పజెప్పారు.
ఈశాన్య రాష్ట్రాల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ నిరాసక్తత !
సరిహద్దు ప్రాంతాల ప్రజలు కొంత కాలంగా తమను తెలంగాణలో విలీనం చేయాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు కేసీఆర్ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. త్వరలోనే శాసనసభ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేసే ఆలోచనలో హైకమాండ్ లేదు. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు సంబంధించి మార్చిలో ఎన్నికలు జరిగేలా ఇప్పటికే నోటిఫికేషన్ జారీ కాగా.. ఇంత తక్కువ సమయంలో పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం ఇబ్బందికరమని పార్టీ భావిస్తోంది. అందుకే పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు.