MIM Manifesto : దేశంలో అసలు మేనిఫెస్టో ప్రకటించని పార్టీ మజ్లిస్ - ఆ పార్టీ ఇచ్చే హామీలు ఎలాంటివో తెలిస్తే ఆశ్చర్యపోతారు !
మజ్లిస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండే అంశాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ప్రజలకు సమస్యలు వస్తే స్పందిస్తామన్నది మాత్రమే ఆ పార్టీ హామీ. ఇంకే హమీలు ఇవ్వరు.
MIM Manifesto : దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఓ మేనిఫెస్టో విడుదల చేస్తాయి. అందులో తమ క్రియేటివిటీని ఉపయోగిచి మరీ ఉచిత హామీలు ప్రకటిస్తాయి. కానీ దేశంలో అన్ని పార్టీల కంటే భిన్నం మజ్లిస్ పార్టీ. ఆ పార్టీ ఎలాంటి మేనిఫెస్టో ప్రకటించదు. మేనిఫెస్టోను ప్రతీ సారి ఎన్నికల సంఘానికి సబ్‌మిట్ చేయాలి. తమకు ఎలాంటి మేనిఫెస్టో లేదని లేఖను మజ్లిస్ సబ్‌మిట్ చేస్తుంది. ఈ సారి కూడా ఎలాంటి మేనిఫెస్టో విడుదల చేయడం లేదని అసదుద్దీన్ ప్రకటించారు. అయితే ఆయన కొన్ని హామీలు పాతబస్తీ వాసులకు ఇచ్చారు.
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే మేనిఫెస్టో
365 రోజులు ప్రజల మధ్యలో ఉండటమే మా ఎజెండా మేనిఫెస్టో అని మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ చెబుతున్నారు. ఎంఐఎం పార్టీ. కౌన్సిలర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా పార్టీ ఆఫీసులో నేరుగా ప్రజలను కలవడమే తమ మేనిఫెస్టోలో ప్రధాన అంశమంటూ అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు . సాధారణంగా పాతబస్తీలో ఏ చిన్న కార్యక్రమం అయినా, చివరికి చావు బతుకులు జరిగినా ఎంఐఎం నేతలు అందుబాటులో ఉంటారని చెబుతున్నారు. పెళ్లిళ్లు జరిగితే చిన్న నేత నుంచి ఎంపీ స్థాయి వరకు అంతా వెళ్లికి హాజరవుతామంటున్నారు.
పెళ్లిళ్లకు ఖచ్చితంగా హాజరవడమే మజ్లిస్ హామీ
ప్రజలు పిలవడమే ఆలస్యం వెంటనే అక్కడికి చేరుకుంటామని.. పెళ్లి వేడుకలకు సైతం పిలిచినా, పిలవకపోయినా వెళ్లి వధూవరులను ఆశీర్వదిస్తుంటారని ఆసద్ మొదటి హామీగా ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా అదుకునేందుకు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు వెంటనే అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఎంపీ వెల్లడించారు. ఇలా నిత్యం జనాల్లో ఉండే ప్రయత్నం దేశంలో ఏ పార్టీ చేయదని అని చెప్పారు . తాము చెప్పిందే చేస్తామని, చేసేదే చెబుతామని ఆ పార్టీ నేత ఆసద్ భరోసా ఇచ్చారు. ఎప్పట్లాగే .. మజ్లిస్ మేనిఫెస్టోలో ఏమీ లేకపోవడంతో ఎవరూ ఆశ్చర్యపోలేదు.
పాతబస్తీలో ఆరేడు సీట్లు ఖాయం
మజ్లిస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించినా ప్రకటించకపోయినా పాతబస్తీలో ఉన్న ఆరేడు సీట్లలో ఆపార్టీ నాయకులు భారీ మెజార్టీతో గెలుస్తారు. పాతబస్తీలో మజ్లిస్ క పోటీగా మరో పార్టీ లేదు గతంలో ఎంబీటీ ఉండేది. కానీ ఆ పార్టీ నేత అమానుల్లా ఖాన్ చనిపోయిన తర్వాత.. మజ్లిస్ పూర్తిగా పట్టు సాధించింది. అధికారంలో ఉండే పార్టీతో సన్నిహితంగా ఉంటూ..పాతబస్తీలోకి ఎవరూ ఎంటర్ కాకుండా.. తమ రాజకీయం తాము చేస్తూ ఉంటుంది. అందుకే ఆ పార్టీ సీట్లకు ఢోకా ఉండటం లేదు. ఈ సారి ఒకటి రెండు సీట్లను పెంంచుకునే ఆలోచన చేస్తున్నారు. పాతబస్తీలో తాము కచ్చితంగా గెలిచే 7 స్థానాలతో పాటు మరో రెండింటిలో బలమైన అభ్యర్థులను బరిలో దించే యోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి .రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాలలో పోటీ చేసేందుకు అభ్యర్థులను ఎంపిక చేపడుతున్నారు. గతంలో యాభై సీట్లలో పోటీ చేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు వెనక్కి తగ్గారు.