Epuri Somanna : షర్మిల పార్టీకి షాక్ - బీఆర్ఎస్‌లో చేరనున్న ఏపూరి సోమన్న !
షర్మిల పార్టీకి ఏపూరి సోమన్నదూరమయ్యారు. ఆయన బీఆర్ఎస్‌లో చేరనున్నారు.
Epuri Somanna : తుంగతుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అభ్యర్థిగా షర్మిల పాదయాత్రలో ప్రకటించిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. బీఆర్ఎస్‌లో చేరేందుకు ఆసక్తి చూపించారు. కేటీఆర్ కూడా ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు అంగీకరించారు టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ లతో కలిసి ఏపూరి సోమన్న కేటీఆర్ ను కలిశారు.
షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఏపూరి సోమన్న షర్మిల పార్టీలో చేరారు. ఏపూరి సోమన్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతూర్తి నియోజకవర్గంలోని వెలిశాల గ్రామానికి చెందినవారు. తన ఆటపాటలతో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం సోమన్నకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగావకాశాన్ని కల్పించినా.. కొన్ని రోజులకు ఆ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలేశారు. ప్రభుత్వంపై తన పాటల ద్వారా పోరాటాన్ని సాగించారు. అనంతరం కొన్ని రోజులకు కాంగ్రెస్ పార్టీలో చేరి గత ఎన్నికల సమయంలో కీలకంగా వ్యవహరించారు. తన సాంస్కృతిక బృందంతో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేశారు. కానీ కాంగ్రెస్ లో గుర్తింపు లభించడం లేదని.. తుంగతుర్తి సీటు వస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో షర్మిల పార్టీలో చేరారు.
షర్మిల పాదయాత్రలో భాగంగా తిరుమలగిరిలోని అంగడి ఆవరణలో నిర్వహించిన దళిత భేరి బహిరంగ సభలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. 2023లో నిర్వహించే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా సోమన్న పోటీ చేస్తారని అన్నారు. అయితే ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తన్నారు. పార్టీ పరమైన కార్యక్రమాలు నిలిపివేశారు. దీంతో ఏపూరి సోమన్న అసంతృప్తికి గురయ్యారు. తన రాజకీయ భవిష్యత్ మళ్లీ గండంలో పడుతుందని భావించి బీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో మొదట్లో కొంత మంది నేతలు చేరారు. ఇందిరా శోభన్, ఏపూరి సోమన్న వంటి వారు చేరారు. అయితే ఇందిరా శోభన్ ముందుగానే రాజీనామా చేశారు. ఇప్పుడు ఏపూరి సోమన్న కూడా రాజీనామా చేయడంతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో షర్మిల తప్ప కాస్త గుర్తింపు ఉన్న నేతలెవరూ లేకుండా పోయారు. మరో వైపు షర్మిల పార్టీ కార్యకలాపాలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ట్విట్టర్‌లో బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారు.