(Source: ECI/ABP News/ABP Majha)
Phone Tapping Case Updates: ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ సంచలన వాంగ్మూలం, ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే ఆ పని చేశారట!
Phone Tapping Case: ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు డిసెంబరు 4న ఎస్‌ఐబీలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను కట్టర్లతో కట్ చేసినట్లు సస్పెండైన డీఎస్పీ ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
DSP Praneeth Rao On KCR : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజులు గడిచే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు గత డిసెంబరు 4న ఎస్‌ఐబీలోని కంప్యూటర్ల హార్డ్ డిస్క్‌లను కట్టర్లతో కట్ చేసినట్లు సస్పెండైన సిరిసిల్ల డీసీఆర్‌బీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. న్యాయస్థానానికి సమర్పించిన వాంగ్మూలంలోని వివరాల ప్రకారం.. ‘ గత ఏడాది నవంబరు 30న ఫోన్ ట్యాపింగ్ నిలిపివేశాం. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన అనంతరం ట్యాపింగ్‌కు సంబంధించిన అన్ని ఆధారాలు, డాక్యుమెంట్లు ధ్వంసం చేయాలని ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆదేశించారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో డిసెంబరు 4న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అదే రోజు రాత్రి 7.30 గంటల సమయంలో ఆర్‌ఎస్‌ఐ అనిల్‌కుమార్‌కు సీసీ కెమెరాలను ఆపేశారు. అనంతరం కంప్యూటర్ సిస్టమ్స్, సర్వర్ల నుంచి 50 హార్డ్ డిస్క్‌లను ఆర్‌ఎస్‌ఐ హరికృష్ణ తొలగించారు. అదే సమయంలో కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి శ్రీనివాస్, అనంత్‌లతో పాటు మరో వ్యక్తి ఎస్‌ఐబీకి వచ్చి కొత్త సర్వర్లను, హార్డ్ డిస్క్‌లను ఇచ్చారు. వీటిని పాత వాటి స్థానంలో అమర్చాం. పాతవాటిని హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ ఎలక్ట్రికల్ కట్టర్‌తో కట్ చేశారు. నా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను ఫార్మాట్ చేశాను. పెన్‌డ్రైవ్‌లనూ పారేశాను’ అని ప్రణీత్‌రావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
స్పెషల్ టీం ఏర్పాటు
‘ఎస్‌ఐబీలో స్పెషల్ టాస్క్‌ల కోసం ఇద్దరేసి చొప్పున ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఏఎస్సైలతోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లతో బృందం ఏర్పాటు చేశాం. కోదాడకు చెందిన గుండు వెంకటేశ్వరరావు మా సామాజికవర్గానికే చెందిన ఇన్‌స్పెక్టర్ కావడంతో అతడిని ఇంటెలిజెన్స్‌లోకి తీసుకొచ్చాం. ఏపీలోని కైకలూరుకు చెందిన నా బాల్య స్నేహితుడు ఇన్‌స్పెక్టర్ బాలే రవికిరణ్ టీం లోకి తీసుకున్నాం. నమ్మకస్థులైన ఎస్సైలు హనుమంతరావు, శ్రీనివాస్, ఏఎస్సైలు బ్రహ్మచారి, మాధవరావు, హెడ్‌కానిస్టేబుళ్లు యాదయ్య, రఫీ, కానిస్టేబుళ్లు హరీశ్, సందీప్, మధూకర్‌రావులతో మా టీం ఏర్పాటు చేసుకున్నాం’ అని ప్రణీత్‌రావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ వ్యతిరేకుల ప్రొఫైళ్లు తయారీ
‘ఎస్‌ఐబీ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ప్రభాకర్‌రావు ఛాంబర్ పక్కనే మాకు రెండు గదుల్ని కేటాయించారు. స్పెషల్ ఆపరేషన్ టీం(ఎస్‌వోటీ) పేరుతో మమ్మల్ని పిలిచేవారు. హైదరాబాద్‌కు చెందిన కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ సమకూర్చిన టూల్స్‌తో రాజకీయ నేతల ప్రొఫైళ్లను రూపొందించడం, బీఆర్ఎస్ ప్రత్యర్థులపై నిఘా ఉంచేవాళ్లం. 17 కంప్యూటర్లతోపాటు ఒక ల్యాప్‌టాప్, కొన్ని పెన్‌డ్రైవ్‌లు తీసుకున్నాం. ప్రత్యేక మెయిల్ ఐడీ, రిక్వెస్ట్ ఐడీల ద్వారా కాల్ డేటా రికార్డర్ (సీడీఆర్), ఐఎంఈఐ, లొకేషన్ల సమాచార సేకరణ చేసేవాళ్లం. దాదాపు 1000-1200 మంది ప్రొఫైళ్లు తయారు చేసి వారి సంభాషణలను రహస్యంగా విన్నాం. నాకు ఎస్‌ఐబీ నుంచి అధికారికంగా మూడు ఫోన్ నంబర్లుండేవి. సొంతంగా మరో ఐదు నంబర్లు వినియోగించాను’ అని ప్రణీత్ రావు వెల్లడించారు.
ఒక్కడికే పదోన్నతి
‘నేను 2007లో ఎస్సైగా పోలీస్‌శాఖలో చేరాను. అధికార దుర్వినియోగం వ్యవహారంలో అప్పటి ఎస్పీ రాజేశ్‌కుమార్ నాపై క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. నల్గొండ ఎస్పీగా ప్రభాకర్‌రావు వచ్చాక బీబీనగర్ ఎస్సైగా అవకాశమిచ్చారు. 2016లో ప్రభాకర్‌రావు ఇంటెలిజెన్స్‌లోకి వెళ్లాక ఆయన్ని కలిసి నేనూ అక్కడే చేరాను. సీనియారిటీ ప్రాతిపదికన 2017 డిసెంబరు 29న ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి లభించింది. ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీ చీఫ్ అయ్యాక నన్ను మళ్లీ ఎస్‌ఐబీలోకి తీసుకున్నారు. 2022లో నాకు డీఎస్పీగా ఆక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించాలని ప్రభాకర్‌రావు ప్రభుత్వానికి ప్రతిపాదించడంతో డీఎస్పీగా పదోన్నతి లభించింది. మా బ్యాచ్ మొత్తంలో డీఎస్పీగా పదోన్నతి పొందింది నేనొక్కడినే’ అని ప్రణీత్‌రావు వాంగ్మూలంలో తెలిపారు.