Kata Amrapali: మళ్లీ తెలంగాణకు ఐఏఎస్ కాట అమ్రపాలి - డీవోపీటీ నుంచి ఉత్తర్వులు
IAS: కాట అమ్రపాలిని మళ్లీ తెలంగాణకు కేటాయిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆమె ఎపీ క్యాడర్ లో ఉన్నారు.

DoPT issues orders allocating Kata Amrapali to Telangana: ఏపీ క్యాడర్ లో ఉన్న ఐఏఎస్ అధికారిణి అమ్రపాలి మళ్లీ తెలంగాణ క్యాడర్ కు వెళ్లనున్నారు. ఈ మేరకు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందిన ఆమెను.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి కేటాయించారు. అయితే ఆమె తెలంగాణలోనే కొనసాగారు. తర్వాత కేంద్ర సర్వీసులకూ వెళ్లారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చారు. అక్కడ గ్రేటర్ కమిషనర్ తో పాటు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏపీ క్యాడర్ లోనే రిపోర్టు చేయాలని ఆదేశించింది. దాంతో తెలంగాణలో రిలీవ్ అయి ఏపీలో రిపోర్టు చేశారు.అయితే తెలంగాణ క్యాడర్‌లోనే ఉండాలనుకుని ఆమె చేసిన ప్రయత్నాలు చివరికి విజయవంతం అయ్యాయి. మళ్లీ తెలంగాణ క్యాడర్ లో చేరనున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత సివిల్ సర్వీసు అధికారుల కేటాయింపు కోసం ఖండేకర్ కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ కేడర్ కేటాయించింది. అయితే ఆ నివేదికలో పేర్కొన్న పలువురు తమ క్యాడర్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కేంద్రానికి,క్యాట్‌కు దరఖాస్తుకు పెట్టుకున్నారు. ఏపీకి కేటాయించిన ఎక్కువ మంది తాము తెలంగాణ స్థానికతతో ఉన్నామని తమకు తెలంగాణ క్యాడరే కావాలని ఉండిపోయారు. అలాంటి అధికారి అయిన సోమేష్ కుమార్ తెలంగాణలో సీఎస్‌గా ఉండగా కోర్టు ఏపీకి వెళ్లాల్సిదేనని స్పష్టం చేసింది. దాంతో ఆయన తెలంగాణ నంచి రిలీవ్ అయి ఏపీలో రిపోర్ట్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తర్వాత అమ్రపాలికి కూడా దాదాపుగా అదే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న ఆమె ఉన్న పళంగా ఏపీలో రిపోర్టు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ చేరినా..అంత యాక్టివ్ గా లేరు. మళ్లీ తెలంగాణకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఎక్కవగా సెలవుల్లో గడిపారు.
ఖండేకర్ కమిటీ సిఫారసులు చేసిన సమయంలో స్థిర నివాసం అనే కాలమ్‌ను కీలకంగా తీసుకున్నారు. యూపీఎస్సీకి దరఖాస్తు చేసిన సమయంలో కాట అమ్రపాలి తన పర్మినెంట్ అడ్రస్‌గా విశాఖ పట్నంను పేర్కొన్నారు. ఖండేకర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రత్యూష్ సిన్హా కమిటీ ఆ నివేదిక ఆధారంగా క్యాడర్ ను కేటాయించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఖండేకర్ కమిటీ ఆమెను ఏపీకి కేటాయించింది. అయితే తనను తెలంగాణ స్థానికురాలిగా పరిగణించి.. తెలంగాణకే కేటాయించాలని ఆమె అప్పీల్ చేసుకున్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీ మొదట్లోనే ఆమె అభ్యర్థనను తిరస్కరించింది.
హైకోర్టు కూడా ఖండేకర్ కమిటీ ఆధారంగా ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన సిఫారసులనే అమలు చేయాలని స్పష్టం చేసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత వరంగల్ జిల్లాకు కలెక్టర్ గా చేసిన అమ్రపాలి తర్వాత కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఓఎస్డీగా.. ప్రధానమంత్రి కార్యాలయంలోనూ పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ తెలంగాణకు వచ్చారు రేవంత్ సర్కార్ లో ఆమెకు కీలక పోస్టులు దక్కాయి. హఠాత్తుగా ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ క్యాడర్ మార్చుకోవడంతో.. మళ్లీ కీలక స్థానాల్లో పోస్టింగ్ దక్కే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.




















