Telangana Corona Cases: అలర్ట్! ఒకేరోజు ఎగబాకిపోయి కరోనా కేసులు, ఆరోగ్యశాఖ హెచ్చరిక
Hyderabad Corona Cases: ఒక్క హైదరాబాద్ లోనే 240 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది.
Telangana Corona Cases: తెలంగాణలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన ఒక రోజు వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 403 కరోనా కేసులను గుర్తించారు. చాలా రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గమనించదగ్గ విషయం. దీంతో తాజాగా తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కేసులు 7,96,704 కు చేరాయి. నిన్న కరోనా నుంచి 145 మంది కోలుకున్నట్లుగా హెల్త్ బులెటిన్ లో వివరించారు.
ఈ కొత్త కేసుల్లో ఒక్క హైదరాబాద్ లోనే 240 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 26,704 శాంపిల్స్ ను టెస్ట్ చేశారు. వీటిలోంచే 403 మందికి కరోనా ఉన్నట్లు బయటపడింది.
అత్యధికంగా 240 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత 103 కేసులు రంగారెడ్డిలో, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 11 కేసులు గుర్తించారు. మిగతా జిల్లాల్లో స్వల్ప సంఖ్యలో కేసులను గుర్తించారు.
అప్రమత్తత అవసరం - డీహెచ్
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు సూచించారు. ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని సూచించారు. జనాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. జలుబు, జ్వరం ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వారు ఉంటే తప్పకుండా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.