CM Revanth Reddy: 'లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ 100 రోజుల పాలనకు రెఫరెండం' - అభ్యర్థుల ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Telangana News: లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు నిర్దేశించారు.
CM Revanth Reddy Meeting With Chevella Parliament Constituency Leaders: కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికలు రిఫరెండం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మల్కాజిగిరి (Malkajigiri) పార్లమెంట్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో చేవేళ్ల నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన మంగళవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చేవెళ్ల లోక్ సభ అభ్యర్థి రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు ఈ మీటింగ్ కు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని.. రాష్ట్రంలో కనీసం 14 పార్లమెంట్ స్థానాలు గెలవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నుంచే దేశ రాజకీయాలకు ప్రచార శంఖారావాన్ని పూరించనున్నట్లు చెప్పారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో జరిగే జనజాతర సభకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారని వెల్లడించారు. ఏప్రిల్ 6 లేదా 7న ఈ సభ జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలు ప్రకటించుకున్నామని.. ఇప్పుడు మళ్లీ అదే చోట జాతీయ స్థాయి గ్యారెంటీలను ప్రకటించుకోబోతున్నామని చెప్పారు.
అభ్యర్థుల ఎంపికపై
రాజకీయ, సామాజిక సమీకరణాలు.. క్షేత్రస్థాయిలో అందరి అభిప్రాయాలు, సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అధిష్టానం అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాతే చేవెళ్లకు రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటుకు సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ కు దానం నాగేందర్ లను అభ్యర్థులుగా ప్రకటించారని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీకి అండగా నిలబడి సోనియాగాంధీ నాయకత్వాన్ని బలపర్చాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.
బీజేపీపై విమర్శలు
పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ దేశానికి ఏం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాని ఎలాంటి కృషి చేయలేదని.. బుల్లెట్ ట్రైన్ ను గుజరాత్ కు తీసుకెళ్లిన మోదీ, వికారాబాద్ కు ఎంఎంటీఎస్ రైలు కూడా తీసుకురాలేదని మండిపడ్డారు. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసుకున్న మోదీ.. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ఎందుకు నిధులివ్వలేదని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా మోకాలడ్డుతోందని.. ఏం చూసి ప్రధాని మోదీకి ఓటెయ్యాలని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో
27న ఢిల్లీకి సీఎం
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 27న ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బుధవారం సీఈసీ సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్రంలో మిగిలిన లోక్ సభ స్థానాల అభ్యర్థుల విషయమై అధిష్టానంతో చర్చించనున్నారు. ఇప్పటికే 9 స్థానాల్లో అభ్యర్థులను ఎంపిక చేయగా.. మరో 8 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ పెద్దలతో చర్చించనున్నారు. దీంతో తుది జాబితాపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.