CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ - 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన
Telangana News: తెలంగాణలో నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సివిల్స్ మెయిన్స్ రాసే అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు.
CM Revanth Reddy Key Announcement On Job Notifications: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం సిద్ధమవుతోన్న తెలంగాణ అభ్యర్థులకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకం (Rajiv Gandhi Abhaya Hastham) కింద రూ.లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మంది లబ్ధిదారులకు వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటైన 90 రోజుల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని అన్నారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని.. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. మెయిన్స్‌లో పాసై ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి సైతం రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.
'20 వేల మందికి శిక్షణ'
చదువుకు తగిన నైపుణ్యాలు లేకపోవడంతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని సీఎం రేవంత్ అన్నారు. యంగ్ ఇండియా వర్శిటీ ద్వారా ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్శిటీ ద్వారా 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నామని.. వచ్చే ఏడాది నుంచి 20 వేల మందికి శిక్షణ ఇస్తామని చెప్పారు. అలాగే, యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్శిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 'రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం వర్శిటీలను నిర్వీర్యం చేసింది. 10, 15 రోజుల్లో అన్ని వర్శిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లను నియమిస్తాం. వర్శిటీల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. కొందరు ఉద్దేశపూర్వకంగానే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నిరసనలు, ధర్నాలు సమస్యలకు పరిష్కారం కాదు. విద్య, ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమం మా ప్రభుత్వ ప్రాధాన్యత. నిరుద్యోగుల చూపు లక్ష్యం వైపు ఉండాలి.' అని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సింగరేణి సీఎండీ బలరాం పాల్గొన్నారు. కాగా, రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకానికి సింగరేణి కాలరీస్ నిధులు సమకూరుస్తోంది.
జిల్లాల వారీగా..
సీఎం రేవంత్ రెడ్డి మొత్తం 135 మంది లబ్ధిదారులకు చెక్కులు అందించగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 14 మంది అభ్యర్థులకు, వరంగల్ అర్బన్ నుంచి 12, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి 11, నల్గొండ జిల్లా నుంచి 10, ఖమ్మంలో 9, కరీంనగర్ నుంచి 8 మంది సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై కాగా వారికి ఆర్థిక సాయం అందించారు. అలాగే, కుమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, మెదక్, నారాయణపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల నుంచి ఒక్కొక్కరు సివిల్స్ మెయిన్స్‌కు అర్హత సాధించారు.
Also Read: Harish Rao: అప్పట్లో మీరే ఫ్రీ అన్నారు, ఇప్పుడు ఫీజు కట్టమంటారా? ఇది దోచుకునే కుట్ర - హరీశ్ రావు లేఖ