KCR News: ముగిసిన కేసీఆర్ రెండ్రోజుల మహారాష్ట్ర పర్యటన, తుల్జాపూర్‌లో సీఎం కీలక వ్యాఖ్యలు
సీఎం కేసీఆర్ తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన ముగిసింది. నేడు సాయంత్రం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్ తుల్జాపూర్ భవానీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. భవానీ అమ్మవారిని దర్శించుకొని సీఎం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ ఆశ్వీర్వచనం అందించారు. తీర్థ ప్రసాదాలు అందించారు. తర్వాత ఆలయ అధికారులు సీఎం కేసీఆర్ గారికి సాంప్రదాయబద్ధంగా తలపాగాను ధరింపజేసి, శాలువాతో సత్కరించి అమ్మవారిని ప్రతిమను బహూకరించారు. అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్‌కు భారీ కాన్వాయ్ లో తిరుగు పయనం అయ్యారు.
అంతకు ముందు స్థానిక విలేకరులతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా తాను ఎవరిని విమర్శించలేదని, అక్కడి నాయకులకు బాధ ఎందుకని ప్రశ్నించారు. వీళ్లకి ఆక్రోషం ఎందుకని ప్రశ్నించారు. అమ్మవారు స్వయంగా పిలిపించుకుంటే తప్ప దర్శనం సాధారణంగా జరిగేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ఉదయం విఠలేశ్వరుని దర్శనం జరిగిందని, ఇప్పుడు తుల్జా భవాని దర్శనం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు. ఇది తమకు దక్కిన అదృష్టంగా సీఎం కేసీఆర్ చెప్పారు.
ధర్మన్న సాదుల్ అనే లీడర్‌తో కేసీఆర్ భేటీ
నేడు ధర్మన్న సాదుల్ అనే వ్యక్తితో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ధర్మన్నను సోలాపూర్ పెద్దన్నగా స్థానికులు పిలుస్తుంటారు. ధర్మన్న సాదుల్ పూర్వీకులు కరీంనగర్ జిల్లా కన్నాపూర్ కి చెందినవారు కాగా, వారి కుటుంబం సోలాపూర్ లో స్థిరపడింది. సోలాపూర్ మేయర్ గా ధర్మన్న పని చేశారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున సోలాపూర్ లోక్ సభకు పోటీ చేసి గెలిచారు. కొన్నాళ్లుగా కాంగ్రెస్ కి దూరంగా ఉంటున్న ధర్మన్న సాదుల్ ఇటీవలే గులాబీ కండువా కప్పుకున్నారు.
బీఆర్ఎస్ మహారాష్ట్ర నేతల్లో ఆయన కూడా కీలకంగా పని చేస్తున్నారు. ధర్మన్న సాదుల్ కి సోలాపూర్‌లో స్థానికంగా మంచి పట్టు ఉంది. ధర్మన్నసాధుల్ కుటుంబానికి స్థానిక పద్మశాలి వర్గంలో మంచి పలుకుబడి ఉంది. అక్కడి రాజకీయాలను ధర్మన్న సాదుల్ సీఎం కేసీఆర్ కి వివరించారు.