KCR To UP : జాతీయ పార్టీ ప్రకటించాక తొలి సారి యూపీకి కేసీఆర్ - కానీ రాజకీయం కోసం కాదు !
మంగళవారం సీఎం కేసీఆర్ యూపీ పర్యటనకు వెళ్తున్నారు. ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు.
KCR To UP : తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ములాయం పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అనారోగ్య సమస్యలతో సోమవారం ఉదయం ములాయం సింగ్ కన్నూమూశారు. ఆయన అంత్యక్రియలను అక్టోబర్ 11న ఆయన స్వగ్రామం సాయ్‌ఫాయ్‌లో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు.
ములాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు యూపీ వెళ్లాలని కేసీఆర్ నిర్ణయం
ములాయం సింగ్ యాదవ్ కొద్ది రోజులుగా ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ పార్టీని నడుపుతున్నారు. ఓ సారి ఐదేళ్ల పాటు యూపీ సీఎంగా కొనసాగారు. అయితే వరుసగా రెండు సార్లు ఎస్పీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీని ఓడించేందుకు కేసీఆర్‌తో కలిసి పని చేసేందుకు అఖిలేష్ యాదవ్ సిద్ధంగా ఉన్నట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల టీఆర్ఎస్‌ను భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భానికి ముఖ్య అతిధులుగా కర్ణాటక, తమిళనాడు నుంచి ఇతర పార్టీల ప్రతినిధులు వచ్చారు. అదే సమయంలో అఖిలేష్ వద్దామనుకున్నా... ములాయం ఆరోగ్యపరిస్థితి బాగోలేదని .. మెరుగుపడిన తర్వాత ఇద్దరూ కలిసి వస్తారని ..అందుకే తాను అఖిలేష్‌ను రావొద్దని చెప్పానని కేసీఆర్ చెప్పారు. అయితే ఈ లోపే దుర్వార్త రావడంతో అఖిలేష్‌ను పరామర్శించి.. ములాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌తో పాటు నడిచేందుకు సిద్ధమైన అఖిలేష్
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీకి మూడుసార్లు సీఎంగా, కేంద్రమంత్రిగా జీవితాంతం నిరుపేద బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ములాయం పని చేశారని కేసీఆర్ కొనియాడారు. ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాతంత్ర్య సమరయోధులు రాజ్ నారాయణ్ వంటి నేతల స్ఫూర్తితో ములాయం రాజకీయాల్లోకి వచ్చారని సీఎం గుర్తు చేసుకున్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రాజకీయాలకు సంబంధం లేకుండా జాతీయ పార్టీ ప్రకటన తర్వాత తొలి సారి ఇతర రాష్ట్ర పర్యటనకు కేసీఆర్
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత తొలి సారిగా ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటన పూర్తి స్థాయిలో రాజకీయాలకు వ్యతిరేకం అయినప్పటికీ ములాయం అంత్యక్రియల్లో పాల్గొనేందుకు దాదాపుగా దేశంలో ఉన్న అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకే అక్కడ రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ పిచ్చాపాటిగా నేతలతో మాట్లాడినా జాతీయ రాజకీయాల విషయంలో యూపీలో ఈ పర్యటన సమయంలో పెద్దగా మాట్లాడే అవకాశం ఉండదని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మరోసారి ఆయన అఖిలేష్‌తో చర్చిస్తారని అంటున్నారు.