Allu Arjun: బన్నీకి ఆ పోలీస్ వీరాభిమాని - అయినా అరెస్ట్ చేయాల్సి వచ్చింది
Hyderabad News: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ను సీఐ రాజునాయక్ అరెస్ట్ చేశారు. అయితే, బన్నీకి ఆయన వీరాభిమాని అని తెలుస్తోంది.

CI Rajunaik Who Is Big Fan To Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టుతో టాలీవుడ్ సహా రాష్ట్రమంతా ఒక్కసారిగా ఉలిక్కపడింది. శుక్రవారం మధ్యాహ్నం బన్నీని సీఐ రాజునాయక్ అరెస్ట్ చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అల్లు అర్జున్‌కు రాజునాయక్ వీరాభిమాని అని సమాచారం. ఆయనతో ఒక్కసారైనా ఫోటో దిగాలని సీఐ అనుకునేవారట. అయితే, విధి నిర్వహణలో తన అభిమాన నటుడినే అరెస్ట్ చేయాల్సి వచ్చింది.
జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
కాగా, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా.. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన శనివారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. న్యాయవాదులు రూ.50 వేల పూచీకత్తును జైలు సూపరింటెండెంట్‌కు సమర్పించారు. శుక్రవారం రాత్రే ఆయన జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. బెయిల్ పత్రాలు జైలు అధికారులకు ఆలస్యంగా అందడంతో బన్నీ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది. జైలు వెనుక గేట్ నుంచి బన్నీని పోలీసులు బయటకు పంపించారు. ఎస్కార్ట్ వాహనం ద్వారా ఆయన తన నివాసానికి చేరుకున్నారు. కాగా, శనివారం ఉదయం 7 గంటలకు అల్లు అర్జున్ రిలీజ్ అవుతారని ప్రచారం సాగడంతో.. ఫ్యాన్స్‌తో పాటుగా మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. దీంతో గందరగోళం ఏర్పడగా.. ఆయన్ను 06:05 గంటలకు వెనుక గేట్ నుంచి పంపించారు.
బన్నీ భావోద్వేగం
జైలు నుంచి విడుదలైన అనంతరం బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ న్యాయవాదులతో దాదాపు 45 నిమిషాలు చర్చలు జరిపారు. బెయిల్ వచ్చినా విడుదల ఆలస్యం కావడంపై వారితో చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి చేరుకోగా.. బన్నీని చూసి కుటుంబసభ్యులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. భార్య, పిల్లలను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అల్లు అర్జున్ కూతురు అర్హ, భార్య, అత్త ఆయన కోసం ఎదురు చూసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నివాసానికి చేరుకున్న బన్నీకి కుటుంబ సభ్యులు దిష్టి తీసి స్వాగతం పలికారు. తన కుమారుడు, కుమార్తెను ఎత్తుకుని అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. సతీమణి స్నేహను ఆప్యాయంగా కౌగిలించుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
తనకు అండగా నిలిచిన వారందరికీ అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు. 'నేను చట్టాన్ని గౌరవిస్తాను, కట్టుబడి ఉంటాను. బాధిత కుటుంబానికి మరోసారి సానుభూతి తెలియజేస్తున్నా. బాధిత కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిది. అభిమానం, ప్రేమతో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నేను బాగానే ఉన్నాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు.' అని పేర్కొన్నారు.
Also Read: Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?



















