Janagana MLA: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురుపై కేసు, తండ్రే పెట్టించారంటున్న కుమార్తె!
సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలం.. తన తండ్రి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.
గత కొంతకాలంగా సిద్దిపేట జిల్లా చేర్యాలలో భూమికి సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి, ఆయన కుమార్తె తుల్జా భవానికీ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన భూమి మీద రిజిస్ట్రేషన్ అయిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించనున్నట్లు సోమవారం తుల్జా భవానీ రెడ్డి ప్రకటించారు. చేర్యాలలో తన పేరు మీద ఉన్న భూమి చూట్టూ వేసిన ప్రహరీ గోడను కూల్చేశారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న తన భూమి ఫెన్సింగ్ ను కూడా తుల్జా భవాని కూల్చేసిందని పక్కనే ఉన్న స్థల యజమాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె మీద చేర్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, తన తండ్రే అతనితో కేసు పెట్టించారని తుల్జా భవానీ రెడ్డి ఆరోపిస్తున్నారు.
రెండు రోజుల క్రితం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి వ్యతిరేకంగా ఓ స్థలం విషయంలో పోరాటం చేస్తున్న ఆమె కుమార్తె మీడియా ముందుకు వచ్చారు. సిద్ధిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్దచెరువు మత్తడి కింది స్థలం.. తన తండ్రి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఈ మేరకు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి ఆదివారం (జూన్ 25) మీడియా ముందుకు వచ్చి.. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని ఆమె తేల్చి చెప్పారు.
తండ్రి తరపున క్షమాపణలు కోరిన భవాని
సదరు స్థలాన్ని కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తామని భవానీ ప్రకటించారు. తన తండ్రి ఎమ్మెల్యేగా ఉంటూ ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేయడం తప్పు అని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పారు. తన తండ్రి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కాకముందే తన తండ్రికి రూ.వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పారు. అలాంటి ఆయన ఈ పని చేయకుండా ఉండాల్సిందని అన్నారు. నా తండ్రి ఊరి భూమి కబ్జా చేసి నా పేరున రిజిస్ట్రేషన్ చేసినందుకు నేను చేర్యాల ప్రజలకు క్షమాపణ కోరుతున్నానని అన్నారు. అంతేకాక, క్షమాపణ కోరుతూ ఉన్నట్లుగా రాసిన ఒక బోర్డును కూడా ఆ స్థలంలో పాతించారు.
చేర్యాల పెద్ద చెరువు మత్తడి దగ్గర తన పేరున రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలోనే భవానీ మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఆ స్థలం 1,200 గజాల భూమి చుట్టూ ఉన్న ప్రహరీని ఆమె తొలగింపజేశారు. ఈ ప్రహరీ కూల్చిన విషయంలోనే తాజాగా కేసు నమోదు అయింది.