కీసరలో దారుణం- ఇంటి పని చేసుకుంటున్న మహిళ మెడ నుంచి బంగారం చోరీ
నాగారం మున్సిపాలిటీ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో.. హైమావతి (55) అనే మహిళ మెడలో ఉన్న 5 తులాల పుస్తెల తాడును దుండగుడు దొంగిలించాడు.
చైన్ స్నాచింగ్.. ఇటీవల ఎక్కడ చూసినా ఇదే కనిపిస్తోంది. వినిపిస్తోంది. మహిళలు అని లేదు, ముసలివాళ్లు అని లేదు. బంగారం దొరికితే చాలన్నట్లు చేస్తున్నారు చైన్ స్నాచింగ్ దొంగలు. బంగారం ఒంటి మీద పెట్టుకుని రావాలంటేనే ఆడవాళ్లు భయపడిపోతున్నారు. ఎట్నుంచి ఎవరు బైక్ మీద వచ్చి దోచుకెళ్లిపోతారో అని వణికిపోతున్నారు. ఇంటి బయట ముగ్గు వేయాలన్నా, పని చేసుకోవాలన్నా మహిళలు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు.
రంగారెడ్డి జిల్లా నాగారం మున్సిపాలిటీ కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని సత్యనారాయణ కాలనీలో చైన్ స్నాచింగ్ జరిగింది. ఇంటిబయట పని చేసుకుంటున్న హైమావతి (55) అనే మహిళ మెడలో ఉన్న 5 తులాల పుస్తెల తాడును దుండగుడు దొంగిలించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.
ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు
ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న చైన్ స్నాచింగ్ ఘటనలు మహిళలను బెంబేలెత్తిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన పోలీసు ఉన్నతాధికారులు జంక్షన్స్ వద్ద ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను కూడా అమర్చారు. వాటి ద్వారా నిందితులను సులభంగా పట్టుకునే వీలుంటుంది. అయినప్పటికీ కొన్ని కేసులు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి.
యువతే ఎక్కువ
గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. వారిలోనూ 18 నుంచి 35 మధ్య వయసువారే దొంగతనం చేస్తున్నట్లు చెప్పారు. వారిలో ఎక్కువశాతం మంది చదువుకున్న వారేనని.. ఉద్యోగాలు దొరక్క దొంగలుగా మారుతున్నట్లు వివరించారు. అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పిస్తామని అన్నారు. అయితే తరచుగా చోరీలకు పాల్పడుతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.