Case On Assam CM : అసోం సీఎంపై హైదరాబాద్‌లో కేసు నమోదు ! తదుపరి చర్యలేమిటంటే ?
అసోం సీఎంపై హైదరాబాద్‌లో కేసు నమోదు చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని రేవంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదయింది.
రాహుల్ గాంధీపై ( Rahul Gandhi ) అనుచిత వ్యాఖ్యలు చేసిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై ( Himanta Biswa Sarma ) జుబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revant Reddy ) సోమవారం కేసు పెట్టాలంటూ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై న్యాయసలహా తీసుకున్న పోలీసులు మూడు సెక్షన్ల కింద అసోం సీఎంపై కేసు నమోదు చేశారు. తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నదానిపై పోలీసులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పటికైతే కేసు నమోదు చేశారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో అసోం సీఎం బిశ్వ శర్మ సర్జికల్ స్ట్రైక్స్‌కు రాహుల్ గాంధీ ఆధారాలు అడిగారని.. ఆయన తండ్రెవరో తాము ఆధారాలు అడిగామా అని ప్రశ్నించారు. ఇవి రాహుల్ గాంధీ తల్లిని కించ పరచరడం కావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేపింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ ( KCR ) కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. బిశ్వ శర్మ దేశ సంస్కృతిపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలను మోదీ ( PM Modi ) సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. సమర్థించకపోతే తక్షణం ఆయనను పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కూడా సర్జికల్ స్ట్రైక్స్ పై తనకు కూడా అనుమానాలు ఉన్నాయని ప్రకటించారు. ఈ తరుణంలో బిశ్వ శర్మతో పాటు పలువురు బీజేపీ నేతలు కేసీఆర్‌పైనా విరుచుకుపడ్డారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బిశ్వశర్మపై తీవ్రంగా విరుచుకుపడటమే కాకుండా పార్టీ తరపున అన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు ( Police Complaint ) పెట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఆ మేరకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇతర చోట్ల కాంగ్రెస్ నేతల ఫిర్యాదులను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు కానీ జుబ్లీహిల్స్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేశారు.
బిశ్వశర్మ తక్షణం క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే అసోం సీఎం తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారు. పదే పదే రాహుల్ గాంధీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ సారి జిన్నాతో పోల్చారు. అయితే బీజేపీ నేతల ( BJP Leaders )తీరును రాహుల్ గాంధీ సున్నితంగానే తిప్పి కొడుతున్నారు. తన ప్రాణాలు తీసినా మోదీ తల్లిదండ్రులను మాత్రం తాను కించ పరచబోనని అంటున్నారు. రాజకీయాల్లో తప్పుడు సంప్రదాయాలను తీసుకొచ్చి దేశాన్ని కలుషితం చేస్తున్నారని బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు.