Karimnagar Accident: బావిలోకి దూసుకెళ్లి మునిగిపోయిన కారు.. లోపల నలుగురు వ్యక్తులు!
కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూర్‌లో ఓ కారు అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడింది. ఆ సమయంలో ఆ కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం.
కరీంనగర్ జిల్లాలో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఓ కారు వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిపోయింది. ఆ సమయంలో ఆ కారులో నలుగురు వ్యక్తులు ఉండడం గమనించదగ్గ విషయం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిన్న ముల్కనూరు శివారులోని పంట పొలాల్లో ఉన్న పెద్ద బావిలోకి కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. అసలే వర్షాకాలం కారణంగా బావి నిండుగా నీటితో నిండి ఉంది. కారు అందులోకి దూసుకెళ్లడంతో వెంటనే మునిగిపోయింది.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్లను తెప్పించి, గజ ఈతగాళ్లను పిలిపించి కారును బయటకు తీసే ప్రయత్నం చేశారు. దాదాపు 2 గంటలుగా కారును బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా దాని తాడు తెగి మళ్లీ కారు బావిలోనే పడింది. దీంతో సిబ్బంది కారును మళ్లీ వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చినముల్కనూరు శివారులో ఓ రైతుకు వ్యవసాయ భూమి ఉండగా ఆ రైతు రోజువారీ పనుల నిమిత్తం పొలం వెళ్లాడు. ఆ పక్కనే ఉన్న వ్యవసాయ భూమిలో అప్పటికే కారు బావిలోకి దూసుకెళ్లి మునిగిపోయింది. బావిలో నుంచి బుడగలు రావడం, అలికిడితో ఏదో మునిగినట్లు రైతు గుర్తించాడు. వెంటనే రైతు ఇరుగుపొరుగు పొలాల్లో ఉన్న సహ రైతులను పిలిచి బావి వద్ద చూపించాడు. బావిలో కారు పడిందని నిర్ధారణ చేసుకున్న వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందం అక్కడికి చేరుకుని కారును వెలికితీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు కనిపించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కారు కాస్త లోతులో ఉండడం వల్ల సహాయ కార్యక్రమానికి ప్రతికూలంగా మారుతోంది. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బావులు, కుంటలు, చెరువులు బాగా నీటితో నిండాయి. దీంతో ఆ వ్యవసాయ బావి కూడా నిండు కుండలా ఉంది. నీరు అధికంగా ఉండడంతో సహాయ కార్యక్రమాని ఆటంకం కలుగుతుంది.