MLC Kavitha: సీబీఐ విచారణకు హాజరు కాలేను - లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత
Kavitha Letter To CBI: సీబీఐ విచారణకు తాను హాజరు కాలేనని, అవసరమైతే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
MLC Kavitha not to appear before CBI on February 26: హైదరాబాద్: ఫిబ్రవరి 26న (సోమవారం) విచారణకు తాను హాజరు కాలేనంటూ సీబీఐకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC Kavitha) లేఖ రాశారు. సీబీఐకి రాసిన లేఖలో ఎమ్మెల్సీ కవిత కీలక అంశాలను ప్రస్తావించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ (CRPC Sec 41A) కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐ(CBI)ని ఆమె కోరారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో విచారణకు హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని కవిత స్పష్టం చేశారు. సీబీఐ నోటీసులకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న కారణంగా.. ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఆ సెక్షన్ కింద నోటీసులు సబబు కాదు
తనకు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదన్నారు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా అందర్నీ ఆలోచింపజేసేలా ఉందన్నారు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని.. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగ ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ప్రచారం సమయంలో ఢిల్లీకి పిలవడమా!
మరోవైపు త్వరలో పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు ఇవ్వడం పలు ప్రశ్నలకు తావునిస్తోందన్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని స్పష్టం చేశారు. ఇది నా ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందని, సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర ఏమీ లేదని... పైగా కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు జారీ చేయగా ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని తెలిసిందే. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని.. సుప్రీం కోర్టులో ఇచ్చిన రిలాక్సేషన్ సీబీఐకి విషయంలోనూ వర్తిస్తుందని కవిత అభిప్రాయపడ్డారు.
గతంలో విచారణకు సహకరించాను
సీబీఐ బృందం గతంలోనూ హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు కవిత సహకరించారు. నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తాను అన్నారు. కానీ 15 నెలల విరామం తరువాత ఇప్పుడు పిలవడం, గతంలో ఉన్న సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు దారితీస్తుందన్నారు. పార్లమెంటు ఎన్నికల తరుణంతో మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందన్నారు. కనుక రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని పేర్కొన్నారు. రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని, అందుకే ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని సీబీఐకి రాసిన లేఖలో కవిత తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తరుణంలో తనకు జారీ చేసిన నోటీసులను నిలిపివేతను పరశీలించాలని సైతం కోరారు.